కొవాక్సిన్‌ తీసుకున్న వారికి అమెరికా శుభవార్త

- November 06, 2021 , by Maagulf
కొవాక్సిన్‌ తీసుకున్న వారికి అమెరికా శుభవార్త

అమెరికా: భారత్‌ బయోటెక్‌ తయారీ కొవాక్సిన్‌ టీకా పొందినవారు తమ దేశంలోకి వచ్చేందుకు అమెరికా అనుమతిచ్చింది. కొవాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అత్యవసర వినియోగ అనుమతులు లభించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. టీకా పొందిన విదేశీయుల విషయమై అమెరికా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) ఇటీవల కొత్త ప్రయాణ మార్గదర్శకాలు ప్రకటించింది. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) లేదా డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు పొందిన టీకాలు తీసుకున్నవారికి మినహాయింపులిచ్చింది. ఈ నెల 8 తేదీ నుంచి అవి అమల్లోకి రానున్నాయి. అందులో భాగంగానే కొవాక్సిన్‌ తీసుకున్నవారికీ మినహాయింపులు వర్తించనున్నాయి. కాగా, డబ్ల్యూహెచ్‌వో నుంచి అత్యవసర వినియోగ అనుమతులు రాకపోవడంతో.. మొన్నటివరకు కొవాక్సిన్‌ తీసుకున్నవారిని టీకా వేసుకోనివారిగానే అమెరికా భావిస్తోంది. తమ దేశానికి వచ్చాక ఫైజర్‌ లేదా మోడెర్నా టీకా వేయించుకోవడం తప్పనిసరి అని నిబంధన విధించింది. తాజాగా  డబ్ల్యూహెచ్‌ నుంచి కొవాక్సిన్‌కు గుర్తింపు రావడంతో ఇక ఇబ్బంది తప్పినట్లే. కాగా, అమెరికా బయల్దేరేముందు ప్రయాణికులు కొవిడ్‌ నెగెటివ్‌ ధువ్రపత్రం చూపాల్సి ఉంటుంది. మరోవైపు  టీకాలు కలుషితం అయ్యాయన్న అనుమానంతో బాల్టిమోర్‌లోని ఎమర్జెంట్‌ బయోసొల్యూషన్స్‌తో 180 మిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని అమెరికా ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ సంస్థ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. 


యూరప్ లో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. ప్రతి లక్ష జనాభాకు 192 కేసులు నమోదవుతున్నాయి. రాబోయేది శీతాకాలం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది కచ్చితంగా మరో వేవ్‌ అని స్వీడన్‌ చీఫ్‌ ఎపిడెమియాలజిస్ట్‌ డాక్టర్‌ ఆండ్రెస్‌ టెగ్నెల్‌ స్పష్టం చేశారు. యూర్‌పలో నెల రోజుల్లో కేసులు 50 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. గత వారం ఆస్పత్రుల్లో చేరికలు రెట్టింపయ్యాయని.. వైరస్‌ వ్యాప్తి ఇదేవిధంగా ఉంటే ఫిబ్రవరి నాటికి 5 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. జర్మనీలో  గురువారం 34 వేల కేసులు రాగా, శుక్రవారం 37,120 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం జర్మనీలో ప్రతి లక్ష మందికి 170 కేసులు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com