దుస్తుల పైనుంచి తాకినా లైంగిక వేధింపే: సుప్రీం సంచలన తీర్పు
- November 18, 2021
దిల్లీ: ''బాలిక శరీరాన్ని నిందితుడు నేరుగా తాకనప్పుడు (స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ లేనప్పుడు), ఆ చర్య పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపుల కిందకు రాదు'' అంటూ...బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపేనని స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు తీర్పు చట్టానికి సంకుచిత వివరణ ఇచ్చేలా ఉందని వ్యాఖ్యానించింది.
''చట్టాలు స్పష్టమైన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. న్యాయస్థానాలు ఆ నిబంధనల్లో గందరగోళం సృష్టించకూడదు. సందిగ్ధతను సృష్టించడంలో న్యాయస్థానాలు అత్యుత్సాహం చూపడం సరికాదు. ఇక్కడ పోక్సో చట్టం లక్ష్యం చిన్నారులను లైంగిక వేధింపుల నుంచి కాపాడటం. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో బాలికను తాకినప్పుడు అది నేరం కిందే లెక్క. అంతేగానీ, నేరాన్ని పరిగణించేటప్పుడు.. నిందితుడు శరీరాన్ని నేరుగా స్పృశించాడా లేదా దుస్తుల పై నుంచి తాకాడా అన్నది అనవసరం'' అని జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేసు పూర్వాపరాలివీ..
2016లో సతీష్ అనే వ్యక్తి ఓ బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక ఛాతీని తాకి ఆమె దుస్తులు విప్పడానికి యత్నించాడు. ఆ బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా సెషన్స్ కోర్టు నిందితున్ని పోక్సో చట్టం కింద దోషిగా పేర్కొంటూ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై నిందితుడు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడి నాగ్‌పుర్ బెంచ్ సంచలన తీర్పును వెలువరించింది. ఓ బాలిక శరీరాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా పేర్కొన్నారు. నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు.
ఈ తీర్పుపై బాలల హక్కుల కార్యకర్తలు, న్యాయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నిలిపివేయాలంటూ అటార్నీ జనరల్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో జనవరి 27న సర్వోన్నత న్యాయస్థానం.. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలిపేసింది. తాజాగా ఆ తీర్పు కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







