కోనేరు ప్రసాద్ రాజీనామాకు కారణo?

- March 23, 2016 , by Maagulf
కోనేరు ప్రసాద్ రాజీనామాకు కారణo?

నిజానికి కోనేరు ప్రసాద్ గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ మరణానంతరం విధిలేని పరిస్థితుల్లో జగన్ చెంతనే ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కోనేరు ప్రసాద్ సీబీఐ వేసిన చార్జిషీట్‌లో ఆరో నిందితుడుగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ ఒత్తిడి మేరకు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు కోనేరు ప్రసాద్ ఆర్థికంగా కూడ సర్దుబాటు చేశారనే ప్రచారం కూడా ఉంది.
అయితే, ఎంపీగా ఓడిపోవడంతో పార్టీ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అదేసమయంలో శ్రీకాకుళంలో బీచ్ మినరల్స్‌ను వెలికితీసేందుకు బీచ్ శాండ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ట్రైమెక్స్ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ ఫ్యాక్టరీ ఎప్పుడో పని ప్రారంభించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో సుమారు రూ.2,500 కోట్లకు బీచ్ మినరల్స్ తీసేందుకు భావనపాడు, కళింగపట్నంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బీచ్ శాండ్ నుంచి మినరల్స్ తీసే విధానంలో అవకతవకలు జరిగాయని, విశాఖపట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది. జగన్ చెంత ఉండటం వల్లే టీడీపీ, బీజేపీలు కోనేరు ప్రసాద్‌ను టార్గెట్ చేస్తున్నాయనే భావన ప్రారంభమైంది. అసెంబ్లీలో విచారణకు ఆదేశించిన పది రోజుల్లోనే కోనేరు ప్రసాద్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి లేఖ పంపారు. క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. రాజీనామా వెనుక ఉన్న కారణాలు విచారణేనని, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com