బహ్రెయిన్‌ కార్మికుల్లో టీబీ ఆందోళనకరం

- March 25, 2016 , by Maagulf
బహ్రెయిన్‌ కార్మికుల్లో టీబీ ఆందోళనకరం

ట్యూబర్‌క్యులోసిస్‌ (టిబి) బహ్రెయిన్‌ కార్మికుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధికి గురవుతున్నవారిలో తక్కువ ఆదాయం గల కార్మికులే ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. అల్‌ హిలాల్‌ ఆసుపత్రి ఇంటర్నల్‌ మెడిసిన్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ నజీబ్‌ అబూబాకర్‌ మాట్లాడుతూ, పరిశుభ్రత లేని ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నట్లు వివరించారు. చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ఎక్కువమంది కలిసి నివసిస్తుండడంతో టిబి విపరీతంగా వ్యాప్తి చెందుతోందని ఆయన చెప్పారు. జ్వరం, ఆగకుండా వచ్చే దగ్గు, నీరసం, బరువు తగ్గడం టిబి ప్రధాన లక్షణాలు. డాక్టర్లు ఎక్స్‌రే ద్వారా, స్పటుమ్‌ టెస్ట్‌ ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. నిర్ధారణ తర్వాత సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో బాధితుడికి వైద్యం అందిస్తారు. ఒకవేళ బాధితులు వలసదారులైతే తగిన మందులు ఇచ్చి, స్వదేశానికి పంపివేయబడ్తారని డాక్టర్‌ అబూబాకర్‌ చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో నిబంధనల ప్రకారం ఈ వ్యాధికి చికిత్స అందించరు. టిబి నూటికి నూరు శాతం నయం అయ్యే వ్యాధి అనీ, ఆరు నెలలపాటు మందుల్ని పూర్తిగా వాడాల్సి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com