తెలంగాణలో భారీగా పెరిగిన కొత్త కేసులు..

- January 05, 2022 , by Maagulf
తెలంగాణలో భారీగా పెరిగిన కొత్త కేసులు..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవ్వడం రాష్ట్రంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. కాగా గడిచిన 24 గంటల్లో 42, 531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1520 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం.. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,85, 543కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4, 034కు చేరింది. గడిచిన 24 గంటల్లో 209 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6168 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

ఒమిక్రాన్‌ కేసుల వివరాలు..
కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్‌ కేసులు నమోదుకాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 13652 మంది ప్రయాణికులకు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు.వారిలో 207 మందికి కరోనా సోకిందని నిర్ధారితమైంది. ఇక ఒమిక్రాన్‌ నిర్ధారిత పరీక్షల కోసం వీటిని జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కి పంపగా.. వారిలో 162 మందికి ఒమిక్రాన్‌ సోకిందని తేలింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్‌ బాధితుల్లో 43 మంది కోలుకున్నారు. కాగా మరో 68మంది ఫలితాలు రావాల్సి ఉందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com