ఏపీలో కరోనా కల్లోలం..

- January 16, 2022 , by Maagulf
ఏపీలో కరోనా కల్లోలం..

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, నిన్నటితో (4,955) పోలిస్తే ఇవాళ కొత్త కేసులు కాస్త తగ్గాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,022 కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,06,280 కి పెరిగింది. వైరస్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,510 కి పెరిగింది.

అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 669 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26వేల 770కి పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,000 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.

కాగా, రెండు జిల్లాల్లో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య వరుసగా రెండో రోజూ వెయ్యి దాటడం భయపెడుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ రెండు జిల్లాల్లో ఆంక్షలు మరింత కఠినం చేయక తప్పదంటున్నారు అధికారులు.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో 1124 కేసులు న‌మోదు కాగా.. విశాఖ జిల్లాలో 1028 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 95 కేసులు నమోదయ్యాయి. నేటి వరకు రాష్ట్రంలో 3,18,62,032 కరోనా టెస్టులు చేశారు.

మరోసారి కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మళ్లీ సెకెండ్ వేవ్ లో లా వైరస్ విస్తరిస్తోంది. కోవిడ్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసింది. కఠిన కర్ఫ్యూ విధించింది. ఫలితంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే, ఇప్పుడు.. కోవిడ్ కొత్త వేరియంట్ కారణంగా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com