మన జాతీయ జెండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం,త్యాగాల చిహ్నం: ఉపరాష్ట్రపతి

- January 25, 2022 , by Maagulf
మన జాతీయ జెండా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం,త్యాగాల చిహ్నం: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్: భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చాలని కలలు గని, దాని కోసం తమ సర్వస్వాన్ని అర్పించిన భారత స్వాతంత్ర్య సమరయోధులు కలలు గన్న బలమైన, సుసంపన్నమైన భారతదేశ నిర్మాణంలో భారతదేశం యువత కీలక పాత్ర పోషించాలని  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. స్వరాజ్యం కోసం పోరు సల్పిన అమరవీరులకు ఇదే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. విదేశీయుల సంకెళ్ళ నుంచి మన దేశాన్ని విముక్తం చేసేందుకు స్వరాజ్య సమరయోధులు చేసిన అపూర్వ త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. 

ముందస్తుగా రికార్డు చేసిన వీడియో సందేశం ద్వారా హైదరాబాద్ లో జరిగిన భారతమాత హారతి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి తమ ప్రసంగాన్ని అందించారు. యువతరంలో దేశభక్తిని, స్ఫూర్తిని నింపాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. భారతదేశ సుసంపన్నమైన వారసత్వం మనందరికీ గర్వకారణమన్న ఆయన, రాబోయే తరాలు మన దేశ ఘనత గురించి తెలుసుకునేలా చేయడంతో పాటు, మన మాతృదేశ సర్వతోముఖాభివృద్ధికి యువత కృషి చేయాలని సూచించారు.

భారత స్వరాజ్య సంగ్రామ స్ఫూర్తిని, నాటి దేశభక్తుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుని ఉపరాష్ట్రపతి నాటి మహనీయులకు నివాళులు అర్పించారు. బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశాన్ని స్వరాజ్యం దిశగా నడిపించిన వారంతా వివిధ భాషలు, విభిన్న నేపథ్యాలకు చెందిన వారన్న ఆయన, అందరి సమష్టి కృషి ఫలితంగానే ఈ రోజు మనమంతా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశ అభివృద్ధి గురించి ఎంతో మంది అనుమానాలను వెలిబుచ్చారన్న ఆయన, వారందరి ఊహాగానాలను తల్లకిందులు చేస్తూ భిన్నమైన సంస్కృతుల మధ్య భారతీయులంతా ఏకతాటి మీద నిలిచి అభివృద్ధిలో భాగస్వాములౌతున్నారని తెలిపారు. భారతదేశ సంస్కృతి, నాగరికత ఇక్కడి ప్రజలను ఒక్కటిగా కలుపుతోందని తెలిపారు. అన్నింటికంటే దేశమే గొప్పదనే ఈ స్ఫూర్తి భారతీయుల రక్తంలోనే ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా భారత జాతీయ పతాకం గొప్పతనాన్ని వివరించిన ఉపరాష్ట్రపతి, మన జెండా రంగుల వస్త్రం కాదని, స్వేచ్ఛ – స్వాతంత్ర్యం – త్యాగాల చిహ్నమని, అది మనలో స్ఫూర్తిని నింపడమే గాక, మనందరికీ గర్వకారణమైన భారతదేశ విజయాలకు చిహ్నమని తెలిపారు.
భారతదేశంలోని 65 శాతం మంది 35 సంవత్సాల లోపు వయసు ఉన్న యువతరం అన్న ఉపరాష్ట్రపతి, ఈ జనశక్తిని సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో స్వావలంబనను, ఆత్మనిర్భరతను సాధించేందుకు మరింత శక్తి, సామర్థ్యం, ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారతదేశ యువత ఆత్మనిర్భర భారత నిర్మాణసారధులుగానే గాక, లబ్ధిదారులుగా భవిష్యత్ ఫలాలను అందుకోబోతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
దేశాన్ని బలోపేతం చేసేందుకు బాహ్య, అంతర్గత దురాక్రమణ బారి నుంచి రక్షించడానికి... ప్రజలను ఐక్యంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచడానికి ప్రార్థించే విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భారతమాత ఫౌండేషన్ ను ఉపరాష్ట్రపతి అభినందించారు. దేశభక్తి, సామాజిక ఐక్యత, జాతీయ సమైక్యతను పెంపొందించే ఈ తరహా ఉత్సవాలను దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com