జనన ధ్రువపత్రాలు ఉచితంగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ నుంచి..

- March 29, 2016 , by Maagulf
జనన ధ్రువపత్రాలు ఉచితంగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ నుంచి..

 జనన ధ్రువపత్రాలు ఉచితంగా జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోన్ చేసుకునే సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. సహాయ వైద్యాధికారుల డిజిటల్ సంతకాలతో కూడిన ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని అధికారులు సంకల్పించారు. ఇది విజయవంతమైతే అనంతరం మరణ ధ్రువపత్రాలు సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. అయితే ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా?, చట్టంలో ఇటువంటి వెసులుబాటు ఉందా? అనే అంశాల పై ప్రస్తుతం దృష్టిపెట్టిన అధికారులు, ఎటువంటి ఇబ్బంది లేనిపక్షంలో వెంటనే తమవద్ద ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్న ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు.
ముఖ్యంగా విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారి తాకిడి రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జనన ధ్రువపత్రాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచి కావాల్సినవారు ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులు నిశ్చయించారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లి చిరునామాతోసహా వివరాలు ఎంటర్ చేయగానే ధ్రువపత్రం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అది ఉచితంగా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నూరు రోజుల ప్రణాళిక నడుస్తున్న విష యం తెలిసిందే.జూన్ మెదటివారం వరకు ఈ ప్రణాళిక అమలుకానుంది. అయితే అప్పటివరకు ఆగకుండా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు ఎటువంటి అడ్డంకులు లేకుంటే వచ్చే రెండు,మూడు రోజుల్లోనే సర్కిళ్లవారీగా వెబ్‌సైట్‌లో ఉం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వెబ్‌సైట్‌లో ఉంచే ధ్రువపత్రం అసలుదో, నకిలీతో తెసుకునేందుకు కోడ్ నెంబర్లు ఇవ్వాలని, సందేహం ఉన్నవారు సదరు కోడ్ నెంబర్ ఆధారంగా జీహెచ్‌ఎంసీలో విచారించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ సంతకాలతో ధ్రువపత్రాలు... జనన, మరణ వివరాలు ఆస్పత్రి నుంచి నేరుగా ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌కు పంపుతారు. వాటిని అధికారులు నమోదు చేసుకొని సంబంధిత వ్యక్తులు పౌరసేవా కేంద్రాలు, లేక మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నప్పుడు వాటిని జారీ చేస్తారు. ఒకవేళ జనన, మరణాలు ఇంట్లో జరిగితే ఆ ఆధారాలతో నిర్ణీత గడువులోగా స్థానిక బల్దియా వార్డు కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదైన తర్వాత మనకు కావాల్సినప్పుడు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని ధ్రువపత్రం పొందవ చ్చు. అన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సహాయ వైద్యాధికారుల డిజిటల్ సంతకాలతో కూడిన ధ్రువపత్రాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.1935నుంచి జనన-మరణాల రికార్డులు.... జీహెచ్‌ఎంసీలో సుమారు 1935నుంచి జనన, మరణ ధ్రువపత్రాల రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే పాతకాలంలో ఎక్కువగా చార్మినార్‌సహా పాతబస్తీ ప్రాం తాల రికార్డులే ఎక్కువగా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు అనంతరం 2007-08లో పురాతన రికార్డులన్నింటినీ డిజిటలైజ్ చేశారు. అలాగే, 1999నుంచి జనన, మరణ నమోదు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2014నుంచి ఈఆఫీసు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అలాగే, అధికారులకు డిజిటల్ కీలు అందజేసి కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్ ద్వారా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే జనన, మరణ ధ్రువపత్రాలను సైతం సహాయ వైద్యాధికారుల(ఏఎంఓహెచ్) డివిజల్ సంతకాలతో జారీచేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జీహెచ్‌ఎంసీలో నమోదైన జనన, మరణాలకు సంబంధించి మనకు కావాల్సినప్పుడు నిర్ణీత ఫీజు చెల్లించి మూడు రోజుల్లోగా మీసేవ ద్వారా పొందే ఆస్కారముంది. పారదర్శకతకు ఆస్కారం... ఇక్కడే ఉంది అసలు కిటుకు. జనన, మరణాలు నమోదై ఉన్నా నిర్ణీత గడువులోగా ఇవి జారీకావడం లేదు. సహాయ వైద్యాధికారుల ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న మధ్య దళారులు, ఆ విభాగంలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల చేయి తడపందే దరఖాస్తులు ముందుకు సాగడం లేదు. మన అవసరాన్నిబట్టి ఒక్కో ధ్రువపత్రానికి రూ.ఐదు వేలవరకూ గం జుతున్నారు. అన్నీ సవ్యంగా ఉంటేనే ఈ రేటు. ఏదైనా పొరపాట్లు ఉన్నా, లేక నగరంలో జనన, మరణాలు జరగకున్నా జరిగినట్లు ధ్రువపత్రం కావాలంటే ఆ ధర వేరే ఉం టుంది. వారు కోరుకున్నంత ముట్టజెప్పాల్సిందే. ముఖ్యం గా పాతబస్తీలో విదేశాలకు పోయేవారు ఇటువంటివి ఎక్కువగా పొందుతున్నారు. వెబ్‌సైట్‌లో ఉంచడంవల్ల ఎవ్వరినీ సంప్రదించకుండా, ఎవ్వరికీ నయాపైసా ఇవ్వకుండానే ఇంటోనుంచే ధ్రువపత్రం పొందే ఆస్కారం కలుగుతుంది.అధికారుల అడ్డుపుల్ల... ధ్రువపత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచాలన్న నిర్ణయంపై సం బంధిత అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎలాగైనా ఈ ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యలు ఎదురవుతాయని, ప్రైవసీకి భంగం కలుగుతుందని తదితర కారణాలతో వారు అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం జనన, మరణ ధ్రువపత్రాల్లో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా నిర్మూలించి పారదర్శకతను తేవాలని కృతనిశ్చయంతో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com