ఈ-పాస్‌పోర్ట్‌: 10 సందేహాలకు జవాబులు

- February 04, 2022 , by Maagulf
ఈ-పాస్‌పోర్ట్‌: 10 సందేహాలకు జవాబులు

భారతీయ పాస్‌పోర్ట్ : 2022-23 సంవత్సరం నుంచి ఈ-పాస్‌పోర్ట్‌(ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్)ను ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లే వారికి అనేక సౌకర్యాలు ఉంటాయని చెబుతున్నారు.

అయితే, ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి, అది ఎలా పని చేస్తుంది? రాబోయే రోజుల్లో సాధారణ పాస్‌పోర్ట్ స్థానంలో ఈ-పాస్‌పోర్ట్‌ను ఎలా ప్రవేశపెడతారు? అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్నవారు చెప్పిన వివరాలు..

1) ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?
ఈ-పాస్‌పోర్ట్ సాధారణ పాస్‌పోర్ట్ లాగానే ఉంటుంది. అయితే, ఎలక్ట్రానిక్ మైక్రోప్రాసెసర్ చిప్‌ను ఉపయోగిస్తారు. ఇది పాస్‌పోర్ట్ కవర్ లేదా, లోపలి పేజీలలో ఉంటుంది.

'ఈ-పాస్‌పోర్ట్‌లో దరఖాస్తుదారుల సమాచారం డిజిటల్‌ సైన్ రూపంలో చిప్‌లో భద్రపరిచి ఉంటుంది' అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ రాజ్యసభలో మాట్లాడుతూ వెల్లడించారు.

ఇందులో పాస్‌పోర్ట్ హోల్డర్‌కు సంబంధించిన మొత్తం సమాచారం ఉంటుంది. ఈ చిప్‌లో నమోదు చేసిన సమాచారాన్ని మార్చడం సాధ్యం కాదు. చిప్‌ను ట్యాంపర్ (మార్పులు చేర్పులు) చేస్తే ఈ-పాస్‌పోర్ట్ పనిచేయడం ఆగిపోతుంది.

2) ఈ-పాస్‌పోర్ట్ ఇప్పటికే ఉందా?
2008 సంవత్సరంలో, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చొరవతో, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ-పాస్‌పోర్ట్‌ల జారీకి పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించింది. ఈ ప్రాజెక్ట్ కింద, దౌత్యవేత్తలు, అధికారుల కోసం సుమారు 20 వేల ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు.

గత అనుభవాల ఆధారంగా అధికారులు, దౌత్యవేత్తలతోపాటు సాధారణ పౌరుల కోసం కూడా ఈ-పాస్‌పోర్ట్‌లను తయారు చేసే బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు అప్పగించారు. ఈ-పాస్‌పోర్ట్‌ కవర్ పేజీలో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఇన్‌స్టాల్ చేశారు. 2022-23లో ప్రభుత్వం ఈ-పాస్‌పోర్ట్‌ను తీసుకురానుంది.

3) ఈ-పాస్‌పోర్ట్‌లో ఎలాంటి సమాచారం ఉంటుంది?
ఈ-పాస్‌పోర్ట్ కోసం బయోమెట్రిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌బాట్‌లు, ఆటో-రెస్పాన్స్ వంటి సాంకేతికత ఉపయిగిస్తారు. ఇప్పటికే పాస్‌పోర్ట్‌లో వేలిముద్రను ఉపయోగిస్తున్నారు. ఈ-పాస్‌పోర్ట్‌లో వేలిముద్రతో పాటు కంటిని కూడా స్కాన్ చేస్తారు (ఐరిస్)

ఈ డేటా అంతా చిప్‌లో నిల్వ చేస్తారు. పాస్‌పోర్ట్‌ను ఉపయోగిస్తున్న వ్యక్తులు నిజమైనవారో కాదో గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

4) సాధారణ పాస్‌పోర్ట్‌కు, ఈ-పాస్‌పోర్ట్‌కు తేడా ఏంటి?
సాధారణ పాస్‌పోర్ట్‌తో మీరు ఒక దేశంలోకి ప్రవేశించినప్పుడు, దాని మీద స్టాంపింగ్ ఉంటుంది. కానీ, ఈ-పాస్‌పోర్టులో ఈ ప్రయాణాల సమాచారమంతా చిప్‌లో ఉంటుంది.

ఈ-పాస్‌పోర్ట్ హోల్డర్ ఏ దేశాకైనా వెళ్లినప్పుడు, అతను ఆ దేశంలో ఎంతకాలం నివసించాడన్నది పేపర్లతో పని లేకుండా తెలుసుకోవచ్చు.

5) ఈ-పాస్‌పోర్ట్‌తో లాభాలేంటి?
సాధారణ పాస్‌పోర్ట్‌తో ఏదైనా దేశానికి వెళ్లినప్పుడు, ముందుగా సంబంధిత దేశ వీసా తీసుకోవాలి. పాస్‌పోర్ట్‌పై వీసా స్టాంప్ చేస్తారు. ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు ప్రయాణానికి ముందు విమానాశ్రయంలో పాస్‌పోర్ట్‌లు, వీసాలను తనిఖీ చేస్తారు.

ఇమ్మిగ్రేషన్ సెక్షన్‌లో తనిఖీలు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది. తరచుగా పొడవైన క్యూలు ఉంటాయి. గంటల తరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ-పాస్‌పోర్ట్‌తో ఆ సమస్యలు తగ్గుతాయి.

ఆటోమేటిక్ చెకింగ్ అంటే మెట్రో రైలులో వెళ్లేటప్పుడు టోకెన్ వేసిన వెంటనే గేట్లు తెరుచుకున్నట్లు, ఈ-పాస్‌పోర్ట్ స్కానింగ్ ద్వారా ఇక్కడ కూడా గేట్లు తెరుచుకుంటాయి.

6) ఈ- పాస్‌పోర్ట్ ఉంటే ఈ-వీసా వస్తుందా?
కొన్ని దేశాలలో ఈ సదుపాయం ఉంది. ఇంట్లో కూర్చొని ఈ-పాస్‌పోర్ట్ సహాయంతో ఈ-వీసా తీసుకోవచ్చు.

మెటావర్స్ బ్లాక్‌చెయిన్ సొల్యూషన్ వ్యవస్థాపకురాలు ప్రీతి అహుజా వద్ద ఈ-పాస్‌పోర్ట్ ఉంది. తాను ఇంటి నుంచే ఈ-వీసా పొందుతానని ఆమె వెల్లడించారు.

ఒక దేశం ఈ-వీసా ను మంజూరు చేసినప్పుడు, అది పాస్‌పోర్ట్‌లోని ఎలక్ట్రానిక్ చిప్‌లో అప్‌డేట్ చేస్తుంది.

ఈ-పాస్‌పోర్ట్ హోల్డర్ ఇమ్మిగ్రేషన్ గేట్‌కు చేరుకున్నప్పుడు, అక్కడ అమర్చిన యంత్రం, కెమెరా పాస్‌పోర్ట్‌లోని చిప్‌ను స్కాన్ చేస్తాయి. స్కానింగ్ జరిగిన వెంటనే గేట్లు తెరుచుకుంటాయి.

పాస్‌పోర్ట్ హోల్డర్ ప్రయాణాలన్నీ చిప్‌లో రికార్డవుతాయి. కంప్యూటర్‌లోని సింగిల్ విండో సాయంతో అనేక సంవత్సరాల రికార్డులను కూడా సులభంగా చూడొచ్చు. అయితే, ఈ-వీసాను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభిస్తుందనేది స్పష్టంగా చెప్పలేదు.

7) ఇండియాలో ఇతర దేశాల ఈ-పాస్‌పోర్ట్ ఎలా పని చేస్తుంది?
ఈ-పాస్‌పోర్ట్‌ చిప్‌ను స్కాన్ చేయడానికి అవసరమైన ఇమ్మిగ్రేషన్ గేట్‌లు ఇండియాలో ప్రస్తుతానికి లేవు.

''ఈ-పాస్‌పోర్ట్‌లోని చిప్ ఇండియాలో పని చేయదు. పాస్‌పోర్ట్ లోపల ఉన్న కాగితాలపై ఇమ్మిగ్రేషన్ అధికారులు స్టాంప్ చేస్తారు. అప్పుడే దేశంలోకి ఎంట్రీ సాధ్యమవుతుంది. ఈ-పాస్‌పోర్ట్ కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంది'' అన్నారు ప్రీతీ అహుజా

8) ఈ-పాస్‌పోర్ట్‌ను ఎవరు తయారు చేస్తారు?
ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేలు, ఆపరేటింగ్ సిస్టమ్‌ను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌కి టెండర్ ఇచ్చింది. వీటిని సిద్ధం చేసిన తర్వాతనే ఈ-పాస్‌పోర్టుల జారీ మొదలవుతుంది.

9) ఏ దేశాల్లో ఈ-పాస్‌పోర్ట్ వాడకం ఎక్కువగా ఉంది?
పాస్‌పోర్ట్‌ల ప్రామాణీకరణ(స్టాండర్డైజేషన్)ను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ(International Civil Aviation Organization-ICAO) నిర్వహిస్తుంది. ఇది ఐక్యరాజ్య సమితి విభాగాలలో ఒకటి. ఇది కాకుండా, ఈ ప్రమాణాలను సొంతంగా ఏర్పాటు చేసుకుని, అమలు చేసే హక్కు అన్ని దేశాలకు ఉంది. అన్ని పాస్‌పోర్ట్‌లు మెషిన్ రీడబుల్‌గా ఉండాలని 2016లో నిర్ణయించారు.

పాస్‌పోర్ట్ విశ్వసనీయతను పెంచడానికి ప్రపంచంలోని చాలా దేశాలు ఈ-పాస్‌పోర్ట్‌ని ఉపయోగిస్తున్నాయి. ఈ-పాస్‌పోర్ట్ తప్పనిసరని ఐసీఏవో ఇంత వరకు చెప్పలేదు. అయితే, ఆ సంస్థ చెప్పినదాని ప్రకారం ప్రస్తుతం 100 కు పైగా దేశాలు ఈ-పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తున్నాయి.

ప్రపంచంలో దాదాపు 45 కోట్లమంది దగ్గర ఎలక్ట్రానిక్ పాస్‌పోర్టులున్నాయి. యూరప్‌లోని చాలా దేశాలలో ఈ-పాస్‌పోర్టులు మాత్రమే పని చేస్తాయి.

10) ఈ-పాస్‌పోర్ట్‌తో సమస్యలేంటి?
''ఈ-పాస్‌పోర్ట్ అన్నమాట చెప్పడానికి, వినడానికి చాలా బాగుంది. ఇది అందుబాటులోకి రావడంతో సైబర్‌ భద్రత విషయంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇది ఒకరకంగా ప్రభుత్వానికి సవాల్‌. ఈ-పాస్‌పోర్ట్‌ ట్యాంపర్ చేయగలిగితే డేటా దుర్వినియోగం కావచ్చు'' అని సైబర్ నిపుణుడు పవన్ దుగ్గల్ అభిప్రాయపడ్డారు.
 
యూజర్లు ఏమంటున్నారు?
మెటావర్స్ బ్లాక్‌చైన్ సొల్యూషన్ వ్యవస్థాపకురాలు ప్రీతి అహుజా గత ఇరవై ఏళ్లుగా ఈ-పాస్‌పోర్ట్ వాడుతున్నారు.

''పాస్‌పోర్ట్ కవర్ పేజీలో కనిపించని చిన్నఎలక్ట్రానిక్ చిప్ ఉంది. కవర్ పేజీ కాకుండా, లోపలి పేజీలో కూడా సాధారణ పాస్‌పోర్ట్ లాగా ఉండే నా సమాచారం అంతా ఉంటుంది'' అని ఆమె బీబీసీతో అన్నారు.

''సాధారణ పాస్‌పోర్ట్‌ లాగానే ఈ-పాస్‌పోర్ట్‌లో 30 లేదా 60 పేజీలు ఉంటాయి. నేను లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లినప్పుడు, ఈ-పాస్‌పోర్ట్‌లు ఉన్నవారికి ఒక ఇమ్మిగ్రేషన్‌ లైన్, మామూలు పాస్‌పోర్టు ఉన్నవారికి ఒక లైన్ ఉండేది. మా లైన్ చిన్నగా ఉండేది. మెషీన్ల ద్వారా పని జరుగుతుంది కాబట్టి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది'' అని వివరించారు అహుజా.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com