తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..

- May 18, 2024 , by Maagulf
తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..

తిరుమల: తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 19వ తేదీ వరకు ఈ పరిణయోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం తొలిరోజు శ్రీమలయప్పస్వామి వారు గజవాహనాన్ని అధిరోహించగా.. ఉభయనాంచారులు పల్లకీపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేశారు. పలు కార్యక్రమాల అనంతరం స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం రెండోరోజు శ్రీపద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి.

శనివారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీపద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. నారాయణగిరి ఉద్యానవనంలో కన్నుల పండువగా పరిణయోత్సవం జరగనుంది. శ్రీవారి ఆలయం నుంచి అశ్వ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనంకు స్వామివారు చేరుకుంటారు. పల్లకిపై ఉద్యానవనంకు అమ్మవార్లు చేరుకుంటారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

శుక్రవారం తిరుమల శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కాంపార్ట్ మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్లు ఉన్నాయి. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com