ఏలూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం..

- April 14, 2022 , by Maagulf
ఏలూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం..

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం కాగా, చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు.

మరో 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 25లక్షల పరిహారంను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ. 5లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని సీఎం జగన్ ఆదేశించారు. మృతుల్లో నలుగురు బీహార్ వాసులు, ఇద్దరు స్థానికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. క్షతగాత్రుల్లో ఏడుగు స్థానికులు, ఐదుగురు బీహార్ వాసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. గతంలో ఫ్యాక్టరీని మూయించి వేయాలని, ఈ ఫ్యాక్టరీ వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని పలుమార్లు ఆందోళనలు నిర్వహించామని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ వద్దకు భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు, మృతుల కుటుంబీకులు చేరుకొని ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫ్యాక్టరీ గేటు తోసుకొని లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్యాక్టరీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com