తాజా వార్తలు చార్మినార్ ప్రాంతాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతాం
- April 04, 2016
పూర్తయితే పర్యాటకానికి మరింత ప్రోత్సాహం పాదచారుల ప్రాజెక్టు పనులు వేగవంతం ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం హైదరాబాద్ : భాగ్యనగర కీర్తికిరీటంలో తలమానికంగా నిలిచిన చార్మినార్‌ను పరిరక్షించి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆ చారిత్రక కట్టడాన్ని కాలుష్య కోరల నుంచి రక్షించేందుకు వీలుగా... పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిరోధించేందుకు గతంలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు.దశాబ్దకాలం గడిచినా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి చేస్తున్నా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది. శాసనసభలో ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడారు. పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. పనులు పూర్తయితే కలిగే ప్రయోజనాలు.. తద్వారా పర్యాటకాభివృద్ధి, వ్యాపార కార్యకలాపాలు ఎలా మెరుగవుతాయనే అంశాలను వారికి వివరించారు. స్వయంగా ప్రభుత్వం సుదీర్ఘకాలంగా నత్తనడకన సాగుతున్న ఈ పనుల పూర్తికి చొరవ చూపడటంతో... పరిసరాల్లోని వ్యాపారులూ ఇందుకు సహకరించేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రి కేటీఆర్ ప్రకటించిన విధంగా ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తయితే సరికొత్త అందాలతో అలరారే చార్మినార్‌ను వీక్షించేందుకు ఆస్కారం ఉంటుంది. పర్యాటకపరంగానూ స్థానికులకు మేలు జరుగుతుంది.
వీటిపై దృష్టి అవసరం... * చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పనులు త్వరగా పూర్తి కావాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరం. చుట్టుపక్కల పెద్దసంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. దుకాణదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణంగా పనుల పూర్తికి నిర్ణయాలు తీసుకోవాలి.
* ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని ఇప్పటికే పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు చుట్టుపక్కల వారికి ఎంతోకొంత అసౌకర్యం తప్పదు. కానీ సాధ్యమైనంత తక్కువ అసౌకర్యంతో.. వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సి ఉంది.
* బఫర్‌జోన్ మినహా పేవ్‌మెంట్ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* బఫర్‌జోన్‌లో పనులు చేయాలంటే ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టర్(డీఎంఏ) నుంచి అనుమతి రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత ఆరు నెలల వ్యవధిలో పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మంత్రి ప్రకటనతో పనులు వేగవంతం అవుతాయని స్పష్టం చేస్తున్నారు.
ఇవీ ఎదురవుతున్న సమస్యలు... * పాదచారుల ప్రాజెక్టులో భాగంగా చార్మినార్ చుట్టూ పేవ్‌మెంట్‌పై గ్రానైట్ రాళ్లను అమర్చేందుకు నిరంభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చేలా తెలంగాణ డీఎంఏకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
* ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం డీఎంఏను నియమించలేదు. ఆ పోస్టును భర్తీ చేసిన వెంటనే అవసరమైన అనుమతులు తీసుకోనున్నారు.
* అంతర్గత రింగ్ రోడ్డు నుంచి అనుసంధాన మార్గాలను నిర్మించాల్సి ఉంది. వీటివల్ల ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంటుంది.
* మక్కామసీదు వెనుక గేటు నుంచి మోతీ గల్లీ వయా జుల్లుఖానా మీదుగా 20 అడుగుల రహదారిని నిర్మించాల్సి ఉంది. ఇక్కడ ఇందుకోసం 12 ఆస్తులు సేకరించాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.
* లాడ్‌బజార్ నుంచి మిట్టీకాషేర్ వరకు 15 అడుగుల మేరకు రహదారిని విస్తరించాల్సి ఉంది.
* చార్‌కమాన్ ఆలయం నుంచి ఆగ్రా హోటల్ వరకు 15 అడుగుల రహదారిని ఏర్పాటు చేయాలి.
* వీటన్నింటికీ సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బాహ్యవలయ రహదారి... ప్రాజెక్టులో భాగంగా బాహ్యవలయ రహదారిని నిర్మించాలని ప్రతిపాదించారు. 40 అడుగులు ఉన్న దారిని 60 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. మొత్తం 5.40 కి.మీ. పొడవున ఈ పనులు చేయాల్సి ఉండగా... దాదాపు పూర్తి కావచ్చాయి. కేవలం 0.58 కి.మీ. మేర మాత్రమే ఇంకా చేయాల్సి ఉంది. ఇందుకోసం 389 ఆస్తులను సేకరించాల్సి ఉండగా.. కేవలం 18 ఆస్తుల సేకరణ మాత్రమే మిగిలిపోయింది. వీటినీ స్వాధీనం చేసుకోగానే.. రహదారి నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్గం అందుబాటులోకి వచ్చినట్లయితే భారీ వాహనాలను ఇటు నుంచి అనుమతించనున్నారు.అంతర్గత వలయ రహదారిని 40 అడుగుల మేరకు విస్తరిస్తున్నారు. ఇదీ కేవలం 0.05 కి.మీల పొడవు నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. 98శాతం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఐఆర్‌ఆర్ నిర్మాణం కోసం 254 ఆస్తులను సేకరించాల్సి ఉండగా.. 243 సేకరణ పూర్తయింది. కేవలం 11 మాత్రమే మిగిలిపోయాయి. వీటినీ సేకరిస్తే పనులు పూర్తి చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన చార్మినార్‌ను వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. చుట్టుపక్కల వీధి వ్యాపారులతో వీరికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టారు. మరోవైపు చార్మినార్ చుట్టూ విచ్చలవిడిగా విద్యుత్తు తీగలు వేలాడుతున్నాయి. సాధారణ దీపాల వెలుగుల్లో రాత్రి సమయంలో చార్మినార్ అందాలను వీక్షించేందుకు అనేకమంది వచ్చినా.. అసంతృప్తిగా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు కేబుళ్ల కోసం ప్రత్యేక డక్టింగ్‌తోపాటు చార్మినార్ ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇక పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు పచ్చదనాన్ని పెంపొందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









