తెలంగాణలో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్

- April 28, 2022 , by Maagulf
తెలంగాణలో పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో థర్మో ఫిషర్స్‌ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటైందని తెలిపారు. థర్మో షిషర్స్ ఇండియా సంస్థ పరిశోధన కోసం ప్రతి ఏటా 1.4 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఉత్పత్తి, భూ, నీటి వనరులపై పరిశోధిస్తోందని పేర్కొన్నారు.

2030 లోపు లైఫ్ సైన్సెస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల సాధనే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో 450 మందికి పైగా ఇంజినీర్లు పనిచేస్తారని మంత్రి కేటీఆర్ చెప్పారు. గత నెలలో బోస్టన్‌లో థర్మో ఫిషర్స్‌ ప్రతినిధులను కలిశానని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. పరిశోధన కేంద్రాల విషయంలో ఆసియాలోనే క్రియాశీలక స్థానంలో ఉన్నామని.. నైపుణ్యం, సామర్థ్యం విషయంలోనూ హైదరాబాద్‌ నగరానిది ప్రత్యేక స్థానమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఐడీపీఎల్‌, ఇక్రిశాట్‌, సీఎస్‌ఐఆర్‌ వంటి ఎన్నో పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి వాతావరణం కల్పిస్తున్నామని.. పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com