ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

- April 30, 2022 , by Maagulf
ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే

న్యూఢిల్లీ : భారత సైన్యం నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవనే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు.  

చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే. ఆయన నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే భారత సైన్యం ట్విటర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. జనరల్ నరవనేతోపాటు సైన్యంలోని అన్ని స్థాయులవారు జనరల్ పాండేను అభినందిస్తున్నట్లు తెలిపింది.  
జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన చదువుకున్నారు. బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు. 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు. భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి నేపథ్యంలో 2001-02లో భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన సమయంలో ఆపరేషన్ పరాక్రమ్‌లో జనరల్ పాండే విధులు నిర్వహించారు. ఆ సమయంలో సరిహద్దులకు ఇరువైపులా, జమ్మూ-కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పెద్ద ఎత్తున దళాల మోహరింపు జరిగింది. 
అప్పట్లో జనరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించిన పాండే ఆపరేషన్ పరాక్రమ్‌లో 117 ఇంజినీర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించారు. నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ-కశ్మీరులోని సమస్యాత్మక ప్రాంతం పలన్‌వాలా సెక్టర్‌లో ఈ ఆపరేషన్ జరిగింది. 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విభిన్న వాతావరణాల్లో, వైవిద్ధ్యభరితమైన  కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com