భారత్‌లో మండుతున్న ఎండలు..

- May 01, 2022 , by Maagulf
భారత్‌లో మండుతున్న ఎండలు..

న్యూ ఢిల్లీ: భారత దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. పలు రాష్ట్రాల్లో సమ్మర్‌ హీట్‌తో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. ఈ నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కానీ ఈ సారి అంతకుమించి ఉండనున్నాయని హెచ్చరించింది.

ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35.05 డిగ్రీలు నమోదయ్యాయి. అంతేకాకుండా ఏప్రిల్‌లో 122 ఏళ్ల తర్వాత అంతటి వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ లో సగటు ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో ఉండటం 122 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే. అంతకముందు 1973, 2010, 2016లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలు ఉంటున్నాయి.

నైరుతి రుతుపవనాల ముందస్తు అంచనాలను వాతావరణ శాఖ తెలిపింది. వానాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని హెచ్చరించింది ఐఎండీ. ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పారు.

ఇక తెలంగాణలో ఇప్పటికే వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు పగటి వేళ 47 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు మూడు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉండనుందని వివరించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం, మంచిర్యాల్‌, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది.

అలాగే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండిపోతాయని హెచ్చరించింది వాతావరణశాఖ.ఇక ఏపీలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు జనాన్ని వణికిస్తున్నాయి. 100 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 571 మండలాల్లో ఉష్ణతాపం ఎక్కువగా ఉంటుందని సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com