ఆర్థిక భారం వాహనదారులపై...

- April 05, 2016 , by Maagulf
ఆర్థిక భారం వాహనదారులపై...

ఆన్‌లైన్‌లో సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్  ఈ నెలాఖరు నుంచి ప్రక్రియ మొదలయ్యే అవకాశం  ఆర్థిక భారం వాహనదారులపైనే  ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ పరిధిలో ఏపీ సిరీస్‌తో ఉన్న దాదాపు 74 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాహనదారులే నేరుగా ఆన్‌లైన్ ద్వారా రాష్ట్ర, జిల్లా కోడ్‌లను సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. కొత్త విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ పాతదే ఉండనుండగా.. స్టేట్ కోడ్, జిల్లా కోడ్‌లు మారనున్నాయి. విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కొత్త కోడ్‌లను కేటాయించింది.ఇందుకు అనుగుణంగా ఏపీ రిజిస్ట్రేషన్ సిరీస్ వాహనదారులు ఆన్‌లైన్‌లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబర్ సిరీస్‌కు సంబంధించి ఆర్‌సీ కార్డును ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడే ఖర్చు భరించాలి. ఆన్‌లైన్‌లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ. 100 వరకు సర్వీసు చార్జీతోపాటు కొత్త ఆర్‌సీ కార్డు తయారీకి అయ్యే చార్జీని కూడా వారే చెల్లించాలి. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే.గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఈ ఖర్చు భరించాల్సి రానుంది. వెరసి ద్విచక్ర వాహనదారులకు దాదాపు రూ. 450 వరకు, కార్లకు అది మరో రూ. 200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా దానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ మొదలు కాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com