యుక్రెయిన్‌లో స్కూల్‌ పై రష్యా బాంబు దాడి… 60 మంది మృతి

- May 08, 2022 , by Maagulf
యుక్రెయిన్‌లో స్కూల్‌ పై రష్యా బాంబు దాడి… 60 మంది మృతి

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా యుక్రెయిన్ తూర్పు భాగంలోని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా సేనలు భీకర దాడులు చేపట్టాయి. లుహాన్స్క్ ప్రాంతంలోని బైలోహారివ్కా గ్రామంలోని స్కూల్ పై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది మరణించారు. దీనిపై లుహాన్స్క్ గవర్నర్ సెర్హీ గైడాయ్ స్పందించారు.

రష్యన్ సేనలు శనివారం మధ్యాహ్నం పాఠశాలపై ఓ బాంబును జారవిడిచాయని గవర్నర్ వెల్లడించారు. ఆ సమయంలో స్కూల్ లో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. బాంబు దాడితో స్కూల్ పూర్తిగా నేలమట్టమైందన్నారు. దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే కానీ అగ్నికీలలు అదుపులోకి రాలేదన్నారు. 30 మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని తెలిపారు.

”రష్యాకు చెందిన విమానం ఈ భవనంపై బాంబు జార విడిచింది.దాడికి గురైన పాఠశాల సరిహద్దులకు కేవలం ఏడు మైళ్ల దూరంలో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. అనంతరం దాదాపు నాలుగు గంటలపాటు అగ్నికీలలు ఎగసిపడ్డాయి” అని స్థానిక అధికారులు తెలిపారు.

కాగా,యుక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి.రష్యా సైన్యం యుక్రెయిన్ లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని యుక్రెయిన్ ప్రభుత్వంతో పాటు, పాశ్చాత్య దేశాలు కూడా ఆరోపిస్తున్నాయి.అయితే ఈ ఆరోపణలను రష్యా కొట్టిపారేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com