సర్కారు వారి పాట సినిమా రివ్యూ.!

- May 12, 2022 , by Maagulf
సర్కారు వారి పాట సినిమా రివ్యూ.!

సినిమా టైటిల్: సర్కారు వారి పాట
నటీనటులు: మహేష్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్ర ఖని, సుబ్బరాజు, నదియ, అజయ్ తదితరులు.
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: మది
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీచంద ఆచంట
రచన, దర్శకత్వం: పరశురామ్
విడుదల తేదీ: 12 మే 2022

‘పోకిరి’, ‘దూకుడు’ సినిమాల స్థాయిలో, అంతకు మించిన కమర్షియల్ ఎలిమెంట్స్, గ్రిప్పింగ్ సక్క్రీన్ ప్లేతో, అద్భుతమైన కథతో ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కించామని, దర్శక నిర్మాతలు అలాగే సాంకేతిక నిపుణులు.. నటీనటులు చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ సినిమా కాబట్టి, ఆటోమేటిక్‌గా ప్రీ రిలీజ్ హైప్ ఆకాశాన్నంటేస్తుంది. మరి, ఆ అంచనాల్ని సినిమా అందుకుందా.? లేదా.?

కథ, కథనాల్లోకి వెళితే..
అప్పులిచ్చి, వాటిని సమర్థవంతంగా వసూలు చేయగల దిట్ట మహేష్. ఓ ఫైనాన్స్ వ్యాపారాన్ని అమెరికాలో నడుపుతుంటాడు. చదువుకోవడం కోసం అమెరికా వెళ్ళిన కళావతి, అక్కడి జూదానికి అలవాటుపడి మహేష్ దగ్గర అప్పులు చేస్తుంది. అంత తేలిగ్గా ఎవరికీ అప్పులివ్వని మహేష్, చూడగానే కళావతికి పడిపోతాడు. కానీ, తాను అనుకున్నంత అమాయకురాలు కాదని తెలుసుకుని, కళావతిని తన అప్పు తీర్చాల్సిందిగా అడుగుతాడు. ఆమె అప్పు తీర్చేది లేదని తేల్చేయడంతో, ఆమె తండ్రి రాజేంద్రనాథ్ దగ్గరకి వెళతాడు. ఈ క్రమంలో అమెరికా నుంచి విశాఖ వస్తాడు. వచ్చాక, పది వేల కోట్లు ఇవ్వాలంటూ రాజేంద్రనాథ్‌ని డిమాండ్ చేస్తాడు మహేష్. అసలేంటి మహేష్ వెనుక బ్యాక్‌గ్రౌండ్? రాజేంద్రనాథ్ ఎలా మహేష్‌కి బాకీ పడ్డాడు.? ఇదంతా తెరపై చూడాల్సిందే.

ఎవరెలా చేశారు.?
మహేష్ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించడమే కాదు, హై ఓల్టేజ్ ఎనర్జీని చూపించాడు. నటనలో మహేష్‌కి వంక పెట్టలేం. కీర్తీ సురేష్, నెగెటివ్ టచ్ వున్న రోల్‌లో బాగా చేసింది. మహేష్ - కీర్తి జోడీ ఆన్ స్క్రీన్ బాగా కుదిరింది. వీరిద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. సముద్రఖని, నదియా తదితరులు ఓకే. వెన్నెల కిషోర్ బాగానే నవ్వించాడు. మిగతా పాత్రధారులంతా తమ తమ పాత్రల పరిధి మేర ఓకే.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, సినిమాటోగ్రపీ చాలా బావుంది. మ్యూజిక్ బావుందిగానీ, తమన్ బలం అయిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆయన స్థాయికి తగ్గట్టు లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ బావున్నాయ్. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుంటే బావుండేది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడని వైనం కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ చాలా బావున్నాయ్.

విశ్లేషణ..
నిత్య జీవితంలో చూసే చాలా అంశాల్ని బేస్ చేసుకుని దర్శకుడు సన్నివేశాలు రాసుకున్నట్టున్నాడు. వాట్సాప్ నీతులే డైలాగులకు, సన్నివేశాలకు స్ఫూర్తి అన్నట్టుంది. కథ, కథనాలు గాడి తప్పేస్తాయి ఎప్పటికప్పుడు. హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయిగానీ, సినిమా పూర్తయ్యాక వెనుదిరిగి చూసుకుంటే, కథ ఏంటి.? కథనమేంటి.? అన్నదానిపై గందరగోళం తలెత్తుతుంది ఎవరికైనా. విడివిడిగా సన్నివేశాల పరంగా చూస్తే, కొన్ని సన్నివేశాలు మహేష్ అభిమానుల్ని అలరిస్తాయి. మొత్తంగా చూస్తే, మహేష్ అభిమానులకి.. తమ అభిమాన హీరో ఎలివేషన్స్ బాగా నచ్చుతాయ్. కథ, కథనాల పరంగా చూసుకుంటే మాత్రం థంబ్స్ డౌన్.!

పినిషింగ్ టచ్: సర్కారు వారి పాట.. రికవరీ ఎలాగట.?

మాగల్ఫ్ రేటింగ్: 2.75/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com