తెలుగు సినిమా పాటకు సిరివెన్నెల గౌరవాన్ని తీసుకొచ్చారు: ఉపరాష్ట్రపతి

- May 21, 2022 , by Maagulf
తెలుగు సినిమా పాటకు సిరివెన్నెల గౌరవాన్ని తీసుకొచ్చారు: ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: తెలుగు సినిమా పాటను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచిన గీత రచయితల్లో సిరివెన్నెలగా సుపరిచితులైన చేంబోలు సీతారామశాస్త్రి అగ్రగణ్యులని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దర్శకులు అడుగుతున్నారనో, నిర్మాతలు ఒత్తిడి చేస్తున్నారనో ఏవో అర్ధం, పర్ధం లేని మాటలతో పాటను రాయకుండా, విలువలతో కూడిన పాటలను సిరివెన్నెల రాశులు పోశారని ఆయన తెలిపారు.
 
హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి, సిరివెన్నెల జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పించారు. చొరవ తీసుకుని ఈ పుస్తకానికి రూపకల్పన చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహితీ వేదిక, సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. 
 
మనం చక్కని భావాలను ఆవిష్కరిస్తే, ప్రేక్షకులు భాషను, సాహిత్యాన్ని నెత్తినపెట్టుకుంటారని సిరివెన్నెల నమ్మారన్న ఉపరాష్ట్రపతి, పండిత పామర రంజకంగా ఆయన సినీ గీతాలను ఆవిష్కరించారని తెలిపారు. సినిమా మాధ్యమం అత్యంత ప్రభావవంతమైందన్న ఆయన, సానుకూల మార్గంలో దీన్ని వినియోగించుకుని సమాజాన్ని జాగృతం చేయవచ్చని తెలిపారు. తెలుగు భాష గురించి, ప్రకృతి గురించి, వసుధైవ కుటుంబ భావన గురించి, యుద్ధోన్మాదం వల్ల జరిగే నష్టాల గురించి, సామాజిక వివక్షల గురించి, సమాజ అభ్యున్నతిలో భాగం కావడం గురించి, గాంధీ మహాత్ముని జీవితం గురించి, విద్యా విధానం గురించి సిరివెన్నెల గారు రాసిన అనేక పాటలను ఈ సందర్భంగా ఉదహరించిన ఉపరాష్ట్రపతి, సిరివెన్నెల సినీ సాహితీ రంగంలో ఓ నిశ్శబ్ధ పాటల విప్లవమని, ఆధునిక వాగ్గేయకారుడని తెలిపారు.
 
సిరివెన్నెల కేవలం భావాలను ఆవిష్కరించడమే గాక, తెలుగు భాషకు సంబంధించిన ఎన్నో నూతన పదాలను తిరిగి పరిచయం చేశారన్న ఉపరాష్ట్రపతి, చాలా మంది సినిమా పాటలను తక్కువ స్థాయికి చెందినవన్నట్లుగా చూసే మనస్తత్వం సరైనది కాదని తెలిపారు.చందాల కేశవదాసు తో మొదలై, సముద్రాల, పింగళి, కొసరాజు, మల్లాది,  ఆత్రేయ, ఆరుద్ర,కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరధి,నారాయణరెడ్డి,వేటూరి వరకూ సినిమా పాటను ఉన్నత స్థాయిలో నిలబెట్టిన అనేక మంది మహనీయులను స్మరించుకున్న ఉపరాష్ట్రపతి, సిరివెన్నెల గారు ఆ వారసత్వాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకువెళ్ళారని తెలిపారు. ఈతరం పాటల రచయితలు సైతం సిరివెన్నెల గారి వారసత్వాన్ని సానుకూల ధోరణిలో ముందుకు తీసుకుపోవడం ఆనందదాయకమన్న ఉపరాష్ట్రపతి, కొందరి పాటలు కాస్త ధోరణి మారుతున్నట్లు కనిపిస్తున్నా సింహభాగం సానుకూల ధోరణిలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
మాట మూగబోయిన చోట, పాట మొదలౌతుందన్న సిరివెన్నెల మాటలు అక్షర సత్యాలన్న ఉపరాష్ట్రపతి, మాటలు చెప్పలేని ప్రతి సందర్భాన్ని పాటల్లో  సిరివెన్నెల పాటల్లో పలికించారని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే అనేక ప్రశ్నలను పాటల్లో సధించటమే గాక, సమాధానాలను సైతం అందించారని పేర్కొన్నారు.ముందు తరాల వారు సిరివెన్నెల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం సంపుటాన్ని ఆవిష్కరించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యమన్న ఆయన, సిరివెన్నెల స్ఫూర్తితో భవిష్యత్ లో తెలుగు సాహిత్యం సుసంపన్నం కావాలని ఆకాంక్షించారు. 
 
ఈ కార్యక్రమంలో సహస్రావధాని గరికిపాటి నరసింహారావు, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా ప్రపంచ సాహితీ వేదిక చైర్మన్ డా.తోటకూర ప్రసాద్, ప్రముఖ సినీ దర్శకులు  త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా సిరివెన్నెల కుటుంబ సభ్యులు, అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com