ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

- May 21, 2022 , by Maagulf
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..

లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నట్లు ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు, హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను బాలకృష్ణ తాజాగా విడుదల చేశారు. ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ పేరిట తన తండ్రి ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలను ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

సినీ రంగంలో నందమూరి తారక రామారావు అడుగుపెట్టిన తరువాత తెలుగు సినిమా రంగాన్ని భారతీయ సినిమా తలెత్తి చూసిందని.. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, తెలుగు సంస్కృతి తలెత్తి నిలబడిందని బాలయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ నెలక 28వ తేదీ నుండి 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు ఈ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని.. ఈ వేడుకలకు నందమూరి కుటుంబ సభ్యులు అందరూ హాజరవుతారని ఆయన తెలిపారు. నందమూరి ఫ్యామిలీ నుండి నెలకొక్కరు, నెలకొక కార్యక్రమంలో పాలుపంచుకుంటారని ఆయన పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఉదయం తమ స్వస్థలం నిమ్మకూరులో జరిగే జయంతి వేడుకల్లో తాను స్వయంగా పాల్గొంటానని బాలకృష్ణ వెల్లడించారు. తమ నాన్నని వందేళ్ల క్రితం జాతికందించిన స్థలం కావడంతో ఇది తన బాధ్యత అని బాలకృష్ణ  అన్నారు. అక్కడి నుండి తెనాలి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన శతాబ్ది వేడుకలను బాలకృష్ణ ప్రారంభిస్తారు. 365 రోజుల పాటు వారానికి 5 సినిమాలు, రెండు సదస్సులతో శతజయంతి ఉత్సవాలను రామకృష్ణ థియేటర్‌లో ఘనంగా నిర్వహించబోతున్నట్లు బాలయ్య తెలిపారు. అంతేగాక నెలకు రెండు పురస్కార ప్రధానోత్సవాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com