ఆయుధాలు ఇవ్వాలంటూ దావోస్ వేదికగా ప్రపంచాన్ని అడిగిన జెలెన్‌స్కీ..!

- May 24, 2022 , by Maagulf
ఆయుధాలు ఇవ్వాలంటూ దావోస్ వేదికగా ప్రపంచాన్ని అడిగిన జెలెన్‌స్కీ..!

రష్యాతో యుద్ధంలో ఎదుర్కొనేందుకు తమకు తగిననన్ని ఆయుధాలు సమకూర్చాలని జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు.

రష్యా దురాక్రమణను జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. తమ దేశంపై సైనిక చర్యకు పాల్పడిన రష్యాపై వెంటనే ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. రష్యా వంటి దేశాలు పొరుగు దేశాలపై దాడికి పాల్పడకుండా ఉండాలంటే ప్రపంచ దేశాల ఆంక్షలే నిరోధిస్తాయని జెలెన్‌స్కీ తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో రష్యా దళాలు ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రారంభించాయి. UN రెఫ్యూజీ ఏజెన్సీ ప్రకారం.. రష్యా దాడి తరువాత దాదాపు 6.5 మిలియన్ల మంది తూర్పు యూరోపియన్ దేశం నుంచి పారిపోయారు. ప్రపంచ దేశాలు వేగంగా చర్యలు తీసుకుంటే పదివేల మంది ప్రాణాలు కాపాడేవారని అధ్యక్షుడు జెలెన్స్కీ విచారం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి బయటపడిన తర్వాత రెండేళ్లకు పైగా స్విస్ ఆల్ప్స్‌లో జరుగుతున్న మొదటి ప్రపంచ ఆర్థిక వేదికలో జెలెన్‌స్కీ ప్రసంగించారు.

రష్యా చమురుపై పూర్తి నిషేధం విధించడంతో పాటు దేశ బ్యాంకులపై నిషేధం, వాణిజ్యానికి దూరంగా ఉండే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలను కోరారు. ఇప్పటికీ రష్యాను వీడని సంస్థలు, ఇప్పటికైనా ఆ దేశాన్ని విడిచివెళ్లాలన్నారు. యుక్రెయిన్‌ పునర్నిర్మాణానికి ముందుకు రావాలని అభ్యర్థించారు. యుద్ధ కారణంగా తూర్పు ప్రాంతంలో నిత్యం 50 నుంచి వంద మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం నిలబడి వారు మృత్యుఒడికి చేరుతున్నారని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని ముగించడానికి ముందు తమ దేశం పునర్‌ వైభవం పొందాలని జెలెన్‌స్కీ ఆకాక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com