ఎఫ్ 3 మూవీ రివ్యూ

- May 28, 2022 , by Maagulf
ఎఫ్ 3 మూవీ రివ్యూ
చిత్రం: ఎఫ్ 3
తారాగణం: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, సునీల్, అలీ, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, రఘు బాబు, అన్నపూర్త, వై.విజయ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
కథ, కథనం, దర్శకత్వం: అనిల్ రావిపూడి
విడుదల తేదీ: 27.05.2022
‘ఎఫ్2’ సినిమా హిట్టయ్యింది గనుక, అదే ‘ఎఫ్’ ఫ్రాంఛైజీలో ‘ఎఫ్3’ అనే సినిమా తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.. తమన్నా, మెహ్రీన్‌లకు తోడు అదనంగా సోనాల్ చౌహన్.. ఇంకో అదనపు గ్లామర్ డోస్ అన్నట్టు పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. ఇలా ‘ఎఫ్3’ సినిమాపై ఆసక్తి పెరగడానికి బోల్డన్ని రీజన్స్.!
కథలోకి వెళ్ళిపోతే.!
బాగా డబ్బున్న ఓ పెద్దాయన, అప్పుడెప్పుడో తప్పిపోయిన తన వారసుడు తిరిగొస్తే, అతనికి ఆస్తినంతా ఇచ్చేయాలనుకుంటాడు. ఆ వారసుడి స్థానంలోకి ఇద్దరు హీరోలు ఎంట్రీ ఇస్తారు.. వీళ్ళతోపాటు మరికొందరు కూడా ఆస్తి మీద కన్నేశారు. ఆ తర్వాత ఏమయ్యిందన్నది మిగతా కథ.!
ఎవరెలా చేశారంటే.!
విక్టరీ వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ పాత్రకి అదనంగా రేచీకటి జోడించాడు దర్శకుడు. వరుణ్ తేజ్‌కి నత్తి. ఆయా పాత్రల్లో ఇద్దరూ ఒదిగిపోయారు. మెహ్రీన్, తమన్నా గ్లామర్‌తో సరిపెట్టారు. సోనాల్ చౌహన్ కూడా గ్లామర్ విషయంలో తనవంతుగా కష్టపడింది. పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌లోనూ అందాల విందు మామూలే. తెరపై బోల్డంతమంది పాత్రధారులు కనిపిస్తారు. ఎవరి పని వారు కొంచెం ‘అతి’తో చేసుకుపోయారు.
సాంకేతిక వర్గం సంగతేంటంటే..
సినిమాటోగ్రఫీ బావుంది. మ్యూజిక్ ఓకే. సినిమా కోసం అవసరమైనంతా ఖర్చు చేశారు. సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ బావున్నాయ్. ఎడిటింగ్ కూడా ఓకే. కామెడీ స్కిట్స్‌లో చాలా సినిమాల్లో చూసేసిన డైలాగులు రిపీట్ అయినట్టు అనిపిస్తాయ్.
విశ్లేషణ..
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘చంటబ్బాయ్’ దగ్గర్నుంచి చాలా సినిమాలు ఈ సినిమా చూస్తోంటే గుర్తుకొస్తాయ్. ఆయా సినిమాల్లోని సన్నివేశాలకు అనిల్ రావిపూడి తనదైన టచ్ ఇచ్చాడు. సరిగ్గా చెప్పాలంటే, దీన్ని ‘ఎఫ్2’ సినిమాకి సీక్వెల్ అనడం కన్నా, చాలా సినిమాల్లోని సన్నివేశాల్ని రీమేక్ చేశారనడం సబబు. కథ, కాకరకాయ్ గురించి మాట్లాడుకోడానికేమీ లేదు. లాజిక్కుల గురించి అస్సలు వెతక్కూడదు. పడీ పడీ నవ్వుకోవడంలో మీకు మీరే సాటి అయితే, నవ్వురాని కొన్ని సన్నివేశాల్ని కూడా మీరు ఈ సినిమాలో ఎంజాయ్ చేసెయ్యొచ్చు. అసలు ‘ఎఫ్2’ సినిమా ఎందుకు సక్సెస్ అయ్యింది.? అన్న డౌట్ చాలామందికి ఇప్పటికీ వుంది. సో, ఈ ‘ఎఫ్3’ కూడా అలాగే సక్సెస్ అయిపోవచ్చు. కానీ, అప్పటికీ ఇప్పటికీ ఓ తేడా వుంది. కాదు కాదు, ఓ ఆప్షన్ వుంది సినీ ప్రేక్షకులకి అదే ఓటీటీ స్ట్రీమింగ్. థియేటర్లకు వెళ్ళి కాలక్షేపం చేయాలనుకునేవారిక ఓకే. సినిమాలో కాస్తయినా కంటెంట్ కావాలనుకుంటే మాత్రం కష్టమే.
చివరగా: డబ్బు పిచ్చి మాత్రమే కాదు.. నవ్వించేయాలన్న పిచ్చి కూడా.! తట్టుకోవడం కష్టమేగానీ.. టూమచ్ హాస్యప్రియులైతే వాళ్ళకి కాస్త ఇష్టమే.!
 
మాగల్ఫ్ రేటింగ్:2.75/5
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com