ఢిల్లీలో మంత్రి కేటీఆర్‌ బిజీబిజీ.

- June 23, 2022 , by Maagulf
ఢిల్లీలో  మంత్రి కేటీఆర్‌ బిజీబిజీ.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు.వరుసగా సమావేశాలు అవుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కావాల్సిన నిధులపై ఫోకస్‌ పెట్టారు.ఇందులో భాగంగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్‌ పూరీని కలిశారు కేటీఆర్.. హైదరాబాద్ సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్‌కు ఆర్థిక సహాయం అందించాలని, హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు.. సమగ్ర మురుగునీటి పారుదల మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం.. 62 ఎస్‌టీపీ ప్లాంట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినట్లు ఆయనకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు. ఎస్‌టీపీ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8,684.54 కోట్లు అంచనా వ్యయం అవుతందని కేంద్రమంత్రికి తెలిపిన కేటీఆర్.. ప్రాజెక్టు వ్యయంలో మూడోవంతు అమృత్-2 పథకం కింద రూ.2,850కోట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.మిగతా మొత్తాన్ని రాష్ట్రం భరిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే 100 శాతం మురుగునీటి శుద్ధిని చేయడమే కాకుండా మూసీ నది, ఇతర నీటి వనరులకు మురుగు కాలుష్యాన్ని తగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు కేటీఆర్.. వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ కు సహకరించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.. పెరుగుతున్న జనాభా, ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ మహానగరంగా మారుతుందన్న ఆయన.. ప్రయాణికుల డిమాండ్‌ను తీర్చడానికి.. 69కిమీ మెట్రో రైలు నెట్‌వర్క్, 46 కిమీ సబ్-అర్బన్ సేవలు / మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) హైదరాబాద్‌లో ఉందని కేంద్రమంత్రికి తెలిపారు.. మెట్రో రైల్, ఎంఎంటీఎస్‌లకు ఫీడర్ సేవలుగా పని చేసేందుకు వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్( PRTS ) , రోప్‌వే సిస్టమ్స్ వంటి స్మార్ట్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం తెలంగాణ అన్వేషిస్తోందని వెల్లడించారు.

ఇక, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు 10 కిలోమీటర్ల పొడవున PRTS కారిడార్‌ను ప్రతిపాదించిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి కేటీఆర్.. ప్రతిపాదిత కారిడార్ వివిధ రవాణా వ్యవస్థలతో అనుసంధానించబడిందని కేంద్రమంత్రికి తెలిపారు. ఇండియన్ పోర్ట్ రైల్ అండ్ రోప్‌వే కార్పొరేషన్ లిమిటెడ్ (IPRRCL) కారిడార్ కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం, డీపీఆర్ లకు కన్సల్టెంట్స్ గా ఉన్నారని పేర్కొన్నారు.. దేశంలో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ కోసం ప్రమాణాలు, స్పెసిఫికేషన్‌లను సిఫార్సు చేయడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ హై పవర్ కమిటీని నియమించిందని ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ప్రమాణాలు, నిర్దేశాలు, ఇతర అంశాలను త్వరగా అందించడానికి శాఖాపరంగా సమన్వయం చేయాలని.. హైదరాబాద్‌లో ప్రతిపాదిత కారిడార్‌ను అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని కేంద్ర మంత్రి హరిదీప్‌ సింగ్‌ పూరీకి వివరించారు మంత్రి కేటీఆర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com