ఆత్మవిశ్వాసానికి మారు పేరు

- July 20, 2022 , by Maagulf
ఆత్మవిశ్వాసానికి మారు పేరు

సాధించాలనే తపన ఉండాలే కానీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే ఇట్టే సాధించగలము. అటువంటి కోవకు చెందిన వ్యక్తి ప్రముఖ మహిళా పర్వతోహకురాలు అరుణిమ సిన్హా. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ఆమె గురించి క్లుప్తంగా మీ కోసం. 

ఉత్తరప్రదేశ్ లోని ఒక కుగ్రామం లో జన్మించిన అరుణిమ చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించి పలు పథకాలు సాధించింది. వాలీబాల్ క్రీడాకారిణిగా పిన్న వయస్సులోనే జాతీయ జట్టులో స్థానం కూడా సంపాదించింది. అయితే అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయింది. 

కాలును కోల్పోయినందుకు తానెప్పుడూ చింతించ లేదు సరి కదా మరింత పట్టుదలతో జీవితంలో ముందుకు సాగడానికే  ప్రాధాన్యత ఇచ్చింది. తనకు వచ్చిన అంగ వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రముఖ మహిళా పర్వతోహకురాలు బచెంద్రి పాల్ మార్గదర్శనం లో పర్వతోహరణ లో శిక్షణ పొంది 2013 సంవత్సరం లో మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పిమ్మట ఆమె ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఎత్తైన శిఖరాలను అధిరోహించి భారత దేశానికి గర్వకారణంగా నిలిచింది. ముఖ్యంగా అంటార్కిటికా ఖండంలో ఉన్న విన్సన్ పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి దివ్యాంగ మహిళగా చరిత్ర సృష్టించింది.

అరుణిమ ఇప్పటి దాకా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. 2015 లో భారత  దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ నీ సైతం అందుకోవడం జరిగింది. 

అనుకోకుండా జరిగిన ప్రమాదంలో అంగ వైకల్యం ప్రాప్తించినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి , పట్టుదల, మొక్కవోని దీక్షతో ముందడుగు వేసి విజయం సాధించిన అరుణిమ సిన్హా నేటి యువతకు ఆదర్శప్రాయురాలు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com