ఏపీ పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఫోకస్...
- July 27, 2022
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతున్న పారిశ్రామిక సంస్థలు, శిక్షణా అకాడమీల పురోగతిపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పట్టుదలతో వివిధ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక కూడా ఆయా సంస్థల పురోగతి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులతో వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించి, వాటిని త్వరితగతిన అందుబాటులోకి తేవాలని సూచించారు.
అనంతపురంలోని పాలసముద్రంలో ఏర్పాటు చేసిన బి.ఈ.ఎల్. వారి డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ పురోగతి గురించి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతికి వివరించారు. బెంగళూరులోని మిసైల్స్ సిస్టమ్స్ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్ కు అనుసంధానంగా 2015లో ఈ సంస్థకు శంకుస్థాపన జరిగింది. 900 ఎకరాల్లో ఏర్పాటు అవుతున్న ఈ సంస్థ దేశంలో అతిపెద్దది.
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ (NACEN) పురోగతి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఉపరాష్ట్రపతి వివరాలు తెలియజేశారు. ఈ తరహా అకాడమీ భారతదేశంలో రెండవది కాగా, దక్షిణాదిన మొదటిది. ఈ ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
మిథాని మరియు నాల్కో సంస్థల ఉమ్మడి భాగస్వామ్య సంస్థగా ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో ఏర్పాటు చేయ తలపెట్టిన హై ఎండ్ అల్యూమినియం మిశ్రమం అభివృద్ధి, మరియు తయారీ సంస్థ ఏర్పాటు పనుల పురోగతి గురించి కేంద్ర గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, ఉపరాష్ట్రపతికి వివరించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించనున్న ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని తుపిలిపాళెం గ్రామంలో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్.ఐ.ఓ.టి) పురోగతి గురించి కేంద్ర శాస్త్ర మరియు సాంకేతిక శాఖ సహాయమంత్రి డా. జితేంద్ర సింగ్ నుంచి ఉపరాష్ట్రపతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉత్పన్నమైన భూమి సమస్యలు కూడా పరిష్కారమైన నేపథ్యంలో, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 2015, 2016లో కేంద్ర మంత్రి హోదాలో చొరవ తీసుకుని సంబంధిత శాఖల మంత్రులతో మాట్లాడి, పనులను సమీక్షించి ఆయా ప్రాజెక్టులు మంజూరు అయ్యేందుకు కృషి చేశారు.ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు ఆయా ప్రాజెక్టుల గురించి సంబంధిత మంత్రిత్వ శాఖలతో చర్చిస్తూ, సూచనలు చేస్తూనే ఉన్నారు.


తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







