కాంగ్రెస్ నేతలతో సోనియా అత్యవసర భేటీ

- July 28, 2022 , by Maagulf
కాంగ్రెస్ నేతలతో సోనియా అత్యవసర భేటీ

న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటు‌లో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

గురువారం ఉదయం నుంచి పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగుతుండటంతో సభను వాయిదా వేశారు. మరోవైపు అధిర్ చౌదరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ కీలక నేతలతో సోనియా గాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే, అధిర్ చౌదురి, ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రపత్ని వ్యాఖ్యలు, బీజేపీ ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు తన వ్యాఖ్యలపై అధిర్ చౌదురి విచారం వ్యక్తం చేశారు. పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.

రాష్ట్రపతి ఏ వర్గానికి చెందిన వారైనా రాష్ట్రపతే అని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. సోనియా గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. అధిర్ చౌదురి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, ఈ అంశాన్ని వదిలేయాలని కోరారు. మరోవైపు పార్లమెంటులో అధిర్ చౌదురి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com