నేడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగదీప్‌ ధన్‌ఖర్

- August 11, 2022 , by Maagulf
నేడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగదీప్‌ ధన్‌ఖర్

న్యూఢిల్లీ: భారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఉదయం 11:45కి ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ కార్యక్రమానికి ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో ఉన్న మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు.

అక్కడ జగదీప్‌ ధన్‌ఖర్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతారు. ఆయన రాజ్యసభ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారు. ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేసిన జగదీప్‌ ధన్‌ఖర్ భారీ మెజారిటితో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 528 ఓట్లతో, 74.36 శాతం శాతం ఓట్లు సాధించారు. జగదీప్‌ ధన్‌ఖర్ రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలోని ఒక గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ చదివిన ఆయన కొన్నేళ్లపాటు రాజస్థాన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

అనంతరం 1989లో లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ నుంచి ఝుంఝును ఎంపీగా గెలిచారు. తర్వాత 1990లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 1993లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019-2022 జులై 17 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com