హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల డిజిటల్ ప్రాసెసింగ్ ప్రారంభం

- August 16, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల డిజిటల్ ప్రాసెసింగ్ ప్రారంభం

హైదరాబాద్: భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజి యాత్ర కార్యక్రమంలో భాగంగా, GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 18 నుంచి ప్రయాణికుల కోసం డిజి యాత్ర ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయాణీకుల డిజిటల్ ప్రాసెసింగ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది. డిజి యాత్ర పేపర్‌లెస్ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది మరియు విమానాశ్రయంలో పలుచోట్ల తనిఖీలను నివారించి, ఎలాంటి అవాంతరాలు లేని ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

డిజి యాత్ర వల్ల, ఎంపిక చేసిన చెక్‌పాయింట్‌లు - డిపార్చర్ డొమెస్టిక్ ఎంట్రీ గేట్ 3 వద్ద మరియు ప్యాసింజర్ టెర్మినల్ భవనంలోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియా (SHA) చెక్ పాయింట్ వద్ద ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్’ ఆధారంగా ప్రయాణీకుల ఆటోమాటిక్ ప్రాసెసింగ్ జరుగుతుంది. డిజి యాత్ర ఎన్‌రోల్‌మెంట్ కోసం డిజి యాత్ర టెక్నికల్ టీమ్ ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. డిజియాత్ర ప్రయోజనాలను పొందేందుకు ప్రయాణికులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌ను గౌరవనీయ ప్రధాని ఆగస్టు 15న ప్రారంభించారు. డిజి యాత్ర యాప్ బీటా వెర్షన్ ప్రస్తుతం ప్లేస్టోర్‌లో (ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్ కోసం) అందుబాటులో ఉంది. ఈ యాప్ IOS ప్లాట్‌ఫారమ్ కోసం మరికొన్ని వారాలలో యాప్ స్టోర్‌లో అందుబాటులోకి వస్తుంది.

డిజి యాత్ర ప్లాట్‌ఫామ్ ఎలా పని చేస్తుంది 

  • ప్రయాణీకులు IOS మరియు Android ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న డిజి యాత్ర మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
  • DY-ID యాప్/ఎయిర్‌లైన్ లేదా OTA యాప్/ఎయిర్‌పోర్ట్ యాప్‌ని తెరవండి
  •  సిస్టమ్ అథెన్టికేషన్ కోసం ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్ (DL) నంబర్‌ను ఎంటర్ చేయండి
  • ప్రయాణీకులకు వారి నమోదిత మొబైల్/ఇమెయిల్‌లో OTP అందుతుంది
  • యాప్‌లో OTPని నమోదు చేయండి
  • డిజి యాత్ర యాప్ ఆధార్/ డ్రైవింగ్ లైసెన్స్ డేటాబేస్ నుండి e-KYC డేటాను సంగ్రహిస్తుంది
  • పాస్‌పోర్ట్ మొదటి పేజీని స్కాన్ చేయండి, MRZ డేటాను సంగ్రహించబడుతుంది, NFC ద్వారా ఇ-చిప్‌ చదవబడుతుంది (ఇది ఐచ్ఛికం)
  • డిజి యాత్ర యాప్ ఆధార్ e-KYC / DL డేటా/ఇ-పాస్‌పోర్ట్ నుండి రిఫరెన్స్ ఫేస్‌ని సంగ్రహిస్తుంది
  • ప్రయాణీకులు సెల్ఫీ తీసుకోవాలి, దీని వల్ల యాప్ ద్వారా ఫేషియల్ బయోమెట్రిక్స్ క్యాప్చర్ చేయబడతాయి
  • డిజి లాకర్ పోర్టల్ ద్వారా ప్రయాణీకుల ముఖం ధృవీకరించబడుతుంది మరియు అథెన్టికేటెడ్ ఫోటోతో అనుసంధానమౌతుంది
  • ప్రయాణీకులు వారి డిజియాత్రా IDలను వారి ప్రస్తుత/భవిష్యత్ విమాన బుకింగ్‌లు లేదా బోర్డింగ్ పాస్‌లతో అనుసంధానిస్తారు
  • ప్రయాణీకుడు బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసినప్పుడు లేదా టిక్కెట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు యాప్ ద్వారా ప్రయాణ డేటా తీసుకోవడం జరుగుతుంది
  • ప్రయాణం చేసే రోజున డిజియాత్రా యాప్ -విమానాశ్రయం, ఎయిర్‌లైన్, ఇమ్మిగ్రేషన్ (అంతర్జాతీయ ప్రయాణం విషయంలో) ఎన్‌క్రిప్ట్ చేయబడిన ప్రయాణీకుల ముఖం, బుకింగ్ సమాచారాన్ని పంచుకుంటుంది

    

డిజి యాత్రతో ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ప్రాసెసింగ్ 

  • ఎయిర్ పోర్టులో E- గేట్ వద్ద ఎంట్రీ
  • ప్రయాణికులు తమ బార్ కోడెడ్ బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేస్తారు
  • ఆ తర్వాత E- గేట్ ఎంట్రీ వద్ద ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) కెమెరాలోకి చూస్తారు
  • ప్రయాణికుల ఐడీని, ప్రయాణ పత్రాలను సిస్టమ్ వాలిడేట్ చేస్తుంది
  • ప్రయాణికులను ఎయిర్ పోర్టులోకి అనుమతించేందుకు E- గేట్ తెరుచుకుంటుంది
     

సెక్యూరిటీ హోల్డ్ ఏరియా(SHA)లోకి ప్రవేశం 

  • ప్రయాణీకులు Pre-SHA వద్దకు వస్తారు
  • ప్రీ SHA-లొకేషన్ వద్ద E-గేట్‌లో ఇన్‌స్టాల్ చేసిన FRS కెమెరాలోకి చూస్తారు
  • సిస్టమ్ ప్రయాణీకుల బయోమెట్రిక్ టెంప్లేట్‌ని ధృవీకరిస్తుంది
  • సిస్టమ్ ప్రయాణికులను అంగీకరిస్తుంది/తిరస్కరిస్తుంది, దానికి అనుగుణంగా ప్రయాణీకులు SHAకి తరలి వెళతారు
     

డిజి యాత్ర ప్రయోజనాలు  

  • డిజిటల్ గైడెన్స్ వ్యవస్థ వల్ల విమానాశ్రయంలోకి సజావుగా నావిగేషన్
  • ప్రయాణ తదుపరి దశల్లో రద్దీ & ఆలస్యాల గురించి రియల్ టైమ్ నోటిఫికేషన్‌లు అందుతాయి
  • విమాన సేవలు, డెస్టినేషన్ బేస్డ్ ఆఫర్‌లను డిజిటల్‌గా బుక్ చేసుకునే అవకాశం
  • రియల్ టైమ్ బయోమెట్రిక్స్‌తో "డిజియాత్ర ID"ని ఉపయోగించి విమానాశ్రయాలలో మరింత భద్రత
  • బోర్డింగ్ పాస్ లేదా ఇ-టికెట్‌ రియల్ టైమ్ లో ఎయిర్‌లైన్ సిస్టమ్‌తో అనుసంధానం 

ప్రదీప్ పణికర్, CEO-GHIAL మాట్లాడుతూ, “డిజి యాత్ర వ్యవస్థ విమానయాన ప్రయాణికులకు, ప్రయాణంలోని అన్ని దశల్లో వేగవంతమైన, అవాంతరాలు లేని, ఏకీకృత విమాన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఇది భారతీయ విమానయాన చరిత్రలో ఒక మైలురాయి. భారత ప్రభుత్వం ప్రయోగాత్మక డిజి యాత్ర కోసం ఎంపిక చేసిన విమానాశ్రయాలలో ఒకటైనందుకు మేము గర్విస్తున్నాము. GHIAL ఇంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ట్రయల్స్‌ను ప్రారంభించింది, ఇది విస్తృత ప్రశంసలను అందుకుంది.ఈ సాంకేతికత ప్రయాణీకులకు పేపర్‌లెస్ ప్రయాణాన్ని అనుమతిస్తుంది.దీని వల్ల వారు తమ ముఖం స్కానింగ్’నే బోర్డింగ్ పాస్‌గా ఉపయోగించగలరు.’’ అన్నారు.

ఈ సందర్భంగా SGK కిషోర్, ED-సౌత్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ – GMR ఎయిర్‌పోర్ట్స్, మాట్లాడుతూ, “గత కొన్నేళ్లుగా సరికొత్త టెక్నాలజీ సొల్యూషన్స్‌ని అందిపుచ్చుకోవడంలో, అనేక టెక్ కార్యక్రమాలను ప్రారంభించడంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ముందువరుసలో ఉంది. హైదరాబాద్ విమానాశ్రయం 2019 సంవత్సరంలో ఫేస్ రికగ్నిషన్ ట్రయల్ చేసి, దేశంలో విజయవంతంగా ఆ ప్రయోగం చేసిన  మొదటి విమానాశ్రయంగా నిలిచింది. దేశీయ ప్రయాణీకులకు, మరియు ఎంపిక చేసిన అంతర్జాతీయ విమానయాన సంస్థల కోసం ఎండ్ టు ఎండ్ పేపర్-లెస్ "E- బోర్డింగ్"ను భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన విమానాశ్రయం కూడా హైదరాబాదే. ప్రయాణీకుల కోసం "ఎక్స్‌ప్రెస్ సెక్యూరిటీ చెక్" సదుపాయాన్ని అందించే భారతదేశంలోని ఏకైక విమానాశ్రయం ఇదే. ప్రయాణాన్ని సులభతరం చేసే డిజి యాత్ర క్రమమంగా గేట్-ఫ్రీ అనుభవానికి దారి తీస్తుంది.’’ అన్నారు.

డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ గుర్తింపు పత్రంతో అనుసంధానించబడినందున, ప్రయాణికులు ఇకపై తమ టిక్కెట్లు/బోర్డింగ్ పాస్‌లు, భౌతిక గుర్తింపు కార్డులను విమానాశ్రయంలోని చెక్‌పోస్టుల వద్ద చూపించాల్సిన అవసరం లేదు. దీని వల్ల క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గి, ప్రాసెసింగ్ వేగంగా జరిగి, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరిచే సరళమైన ప్రక్రియలకు దారి తీస్తుంది. డిజి యాత్ర వివిధ సౌకర్యాలు, ప్రోటోకాల్‌లు, ఎయిర్‌లైన్ టైమింగ్‌లు, విమానాశ్రయంలో క్యూలో వేచి ఉండే సమయాల గురించి సంబంధిత సమాచారాన్ని స్వీకరించడానికి కూడా ప్రయాణీకులను అనుమతిస్తుంది.

డిజి యాత్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఎంపిక చేసిన ఐదు విమానాశ్రయాల్లో GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. DigiYatra బృందం ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలతో సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. DigiYatra మొబైల్ యాప్ పూర్తిగా సురక్షితం, ఎందుకంటే ప్రయాణీకుల బయోమెట్రిక్ వివరాలు ప్రయాణీకుల మొబైల్‌లోనే స్టోర్ అయి ఉంటాయి, వాటిని ఎవరితోనూ పంచుకోరు. అంతే కాకుండా ఇది పూర్తిగా ఐచ్ఛికం మరియు దీనితో పాటు నాన్ బయోమెట్రిక్ ప్రాసెస్ కూడా కొనసాగుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com