‘లైగర్-సాలా క్రాస్ బ్రీడ్’ మూవీ రివ్యూ

- August 25, 2022 , by Maagulf
‘లైగర్-సాలా క్రాస్ బ్రీడ్’ మూవీ రివ్యూ

నటీనటులు: విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, మైక్ టైసన్, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, తదితరులు.
దర్శకత్వం: పూరీ జగన్నాధ్,
నిర్మాతలు: కరణ్ జోహార్, ఛార్మి, పూరీ జగన్నాధ్ 
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
ఎడిటింగ్: జునైద్ సిద్దిఖీ

భారీ అంచనాల నడుమ, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రంగా ‘లైగర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు నాట రౌడీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’. పక్కా సూపర్ హిట్ అనే కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించాడు పూరీ జగన్నాధ్. మరి పూరీ లెక్క ‘లైగర్’ విషయంలో కరెక్ట్ అయ్యిందా.? రౌడీ స్టామినా నార్త్‌లో ఎంత మేర వర్కవుట్ అయ్యింది.? తెలుసుకోవాలంటే ‘లైగర్’ సినిమా చూడాల్సిందే.

కథ:
ముందు నుంచీ చెప్పుకుంటున్నదే.. ఈ సినిమా టైటిలే ‘లైగర్’. అంటే ఓ లయన్‌కీ, టైగర్‌కీ పుట్టిన క్రాస్ బ్రీడ్ అని. మరి సినిమాలో లయన్ ఎవరు.? అంటే ఇంకెవరు ప్రత్యేకంగా చెప్పుకున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్. టైగర్ ఎవరా.? అంటే రాజమాత రమ్యకృష్ణ. 
సరే, అసలు కథలోకి వెళ్లిపోదాం. విదేశీయుడు మైక్ టైసన్ ఓ ఇంపార్టెంట్ పని మీద ఇండియాకి వస్తాడు. ఇండియాలో బాలమణి (రమ్యకృష్ణ)ను చూసి, ఆమెతో ప్రేమలో పడతాడు. అలా మైక్ టైసన్‌కీ, బాలమణికి పుట్టిన క్రాస్ బ్రీడ్ సంతానమే ‘లైగర్’ (విజయ్ దేవరకొండ). లైగర్‌కి చిన్నతనం నుంచీ ఫైటర్ అవ్వాలని కోరిక. దేశం గర్వించదగ్గ స్థాయిలో ఫైటర్ అనిపించుకోవాలన్న కసితో పెరుగుతూ వుంటాడు. అదే కసితో కరీంనగర్ నుంచి, తల్లితో కలిసి ముంబయ్ వస్తాడు. అక్కడ బాగా రిచ్ అమ్మాయి అనన్య పాండేతో లవ్‌లో పడతాడు. మరి, ఫైటర్ అవ్వాలన్న తన కోరికను తీర్చుకోవడానికి లైగర్ ఏం చేశాడు.? తన పుట్టుకకు కారణమైన మైక్ టైసన్ తల్లితో కలిసి ఎందుకు వుండడం లేదు.? అసలు బాలమణి ఫ్లాష్ బ్యాక్ ఏంటీ.? అనేది తెలియాలంటే ‘లైగర్’ మూవీ ధియేటర్లో చూడాల్సిందే. 

నటీనటుల పనితీరు:
‘లైగర్’‌గా విజయ్ దేవరకొండ పాత్రకు ఎక్కడా వంకలు పెట్టడానికి లేదు. అక్కడక్కడా నత్తిగా మాట్లాడుతూ విజయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫైటర్‌ లుక్స్ కోసం తన ఫిజిక్‌ మేకోవర్ ఆకట్టుకుంటుంది. అలా తన బాడీని మార్చుకోవడానికి విజయ్ ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టమంతా స్ర్కీన్‌పై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బాలమణి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగపోయింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కాన్ఫిడెంట్ లుక్స్ అన్నీ ప్రశంసించదగ్గవే. తన సీనియారిటీని రంగరించి వదిలిపెట్టింది. మైక్ టైసన్ విదేశీయుడి పాత్రలో చక్కగా కుదిరాడు. తొలి సినిమా అయినా ఆయన స్ర్కీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. బాక్సింగ్ కోచ్‌గా రోనిత్ రాయ్ బాగా చేశాడు. అలీ, గెటప్ శీను, మకరంద్ దేశ్ పాండే, విషు రెడ్డి తదితరులు తమ పాత్రల మేరకు బాగానే నటించారు. హీరోయిన్‌గా అనన్య పాండే పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. 

సాంకేతికంగా ఎలా వుందంటే:
పూరీ జగన్నాధ్ టేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఆయన మార్కు టేకింగ్ చూపించడంలో ‘లైగర్’ విఫలమైందనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. టేకింగ్ మీద కన్నా, ఆయన కథ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కథతో పాటూ, మేకింగ్‌లోనూ ప్రేక్షకుల్ని కట్టి పడేయగల సత్తా వున్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఆ తరహా స్టైల్ మేకింగ్ ‘లైగర్’లో ఎక్కడా కనిపించలేదన్న నిరాశ సగటు ఆడియన్‌లో సుస్పష్టంగా కనిపించింది. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్‌పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి వుంటే బాగుండేది. మ్యూజిక్ కూడా ఏమంత ఆకట్టుకోలేదనే చెప్పాలి. నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయంతే. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ జస్ట్ ఓకే అన్న సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వగలమంతే.

ప్లస్ పాయింట్స్: 
విజయ దేవర కొండ వన్ మ్యాన్ షో
తల్లీ కొడుకుల ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:
డల్ అండ్ కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే 
నాన్ సింగ్ సీన్స్

వివరణ:
ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి ప్రమోషన్లలో చూపించాడు కానీ, సినిమాపై ఆ కసి అంతగా చూపించినట్లు లేదు పూరీ జగన్నాధ్. డైరెక్టర్‌గా తనకు ఏవైతే బలం, బలగమో వాటినే ఈ సినిమాలో మిస్ చేసుకున్నాడు పూరీ. ఆయన సినిమాకి టేకింగ్, కథ, కథనం, డైలాగులు.. ఇవే బలాలు. అలాంటిది ఆ విషయంలో పూరీ చాలా డిజప్పాయింట్ చేశాడు. విజయ్ తన వంతు బాగానే కష్టపడ్డాడు. కానీ, కష్టం వృధా అయ్యింది. కెరీర్ బెస్ట్ మూవీగా నిలవాల్సిన ‘లైగర్’ కంప్లీట్‌గా నిరాశపరించిందనే అభిప్రాయాలే వెల్లువెత్తుతున్నాయ్. ఇక ఆడియన్స్‌ని ఎలా ఎట్రాక్ట్ చేస్తుంది.. బాక్సాఫీస్ వద్ద ఎలా నిలదొక్కుకుంటుందన్న అంశం కేవలం ఆడయన్స్ చేతుల్లోనే వుంది. సినిమాలో అయితే ఏం లేదని తేలిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com