ఆసియా కప్ 2022: భారత్ పై గెలిచిన పాకిస్థాన్
- September 05, 2022
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మరోసారి భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను అలరించింది. గత మ్యాచ్ కు ఏ మాత్రం తగ్గకుండా సాగిన సూపర్ 4 పోరులో భారత్ పై పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
చివరి వరకు పోరాడినా భారత్ కు మాత్రం పరాజయమే ఎదురైంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసి నెగ్గింది. మొహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 71; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి అర్ధ శతకంతో రాణించాడు. మొహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ గతిని మార్చే ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో కీలక సమయాల్లో భారత్ చెత్త బౌలింగ్, ఫీల్డింగ్ కూడా పాకిస్తాన్ కు కలిసొచ్చింది.
ఛేదనకు దిగిన పాకిస్తాన్ ను ఆరంభంలో భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు. 4వ ఓవర్ లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని బరిలోకి దింపిన రోహిత్ శర్మ.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం (14)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఫఖర్ జమాన్ (15) కూడా అవుటయ్యాడు. దాంతో పాక్ తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 76 పరుగులు మాత్రమే చేసింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ అయిన నవాజ్ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఒకరకంగా చెప్పాలంటే పాకిస్తాన్ విజయానికి బాటలు వేసింది నవాజే. నవాజ్ సూపర్ ఇన్నింగ్స్ కు రిజ్వాన్ కూడా తోడవ్వడంతో పాకిస్తాన్ విజయం వైపు దూసుకెళ్లింది. అయితే భువనేశ్వర్ కుమార్ నవాజ్ ను అవుట్ చేయడం.. ఆ తర్వాతి ఓవర్లోనే రిజ్వాన్ కూడా పెవిలియన్ కు చేరడంతో భారత్ రేసులోకి వచ్చింది.
రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ లో హార్డ్ హిట్టర్ ఆసిఫ్ అలీ భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశలో గాల్లోకి లేచింది. అక్కడే అర్ష్ దీప్ సింగ్ ఉండటంతో క్యాచ్ ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే అత్యంత సులభమైన క్యాచ్ ను అర్ష్ దీప్ మిస్ చేశాడు. ఇక్కడ బతికిపోయిన ఆసిఫ్.. భువనేశ్వర్ బౌలింగ్ లో భారీ సిక్సర్.. 20వ ఓవర్ లో ఫోర్ కొట్టి భారత్ కు విజయాన్ని దూరం చేశాడు. చివరి ఓవర్లో కాస్త నాటకీయంగా జరిగినా ఐదో బంతిని స్ట్రయిట్ గా ఆడిన ఇఫ్తికర్ అహ్మద్ పాక్ ను గెలిపించాడు. గత మ్యాచ్ లో హీరోగా మారిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో మాత్రం జీరో అయ్యాడు. బ్యాటింగ్ లో డకౌట్ అవ్వడంతో పాటు 4 ఓవర్లలో 44 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) బ్యాక్ టు బ్యాక్ అర్ధ సెంచరీలు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 28; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాదబ్ ఖాన్ 2 వికెట్లు తీశాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..