ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకు ఒక అందం: సినీదర్శకులు

- September 20, 2022 , by Maagulf
ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకు ఒక అందం: సినీదర్శకులు

 అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 190 టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి నీలిమ గడ్డమణుగు వ్యాఖ్యాత గా 18 సెప్టెంబర్ 2022  నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో ప్రముఖ చలనచిత్ర దర్శకులు వి. న్. ఆదిత్య, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, ప్రముఖ నటులు, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, ప్రముఖ నేపధ్య గాయనీమణులు గీత మాధురి, మాళవిక, ప్రముఖ నేపధ్య గాయకులు, ఇండియన్ ఐడల్ రన్నర్ అప్ రోహిత్,  అనురూప్, యు.యెస్.ఏ నుంచి తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, శంకర్ నేత్రాలయ, యు.యెస్.ఏ బోర్డు సభ్యులు సౌమియా నారాయణన్,  భారతదేశం నుంచి లక్ష్మయ్య మంత్రి తదితరులు పాల్గొన్నారు.

 ముందుగా వి. న్. ఆదిత్య మాట్లాడుతూ మీరందరు విదేశాల్లో ఉండి కూడా చాలా కస్టపడి  సినిమా పరిశ్రమకు  చెందిన ఒక అమరగాయకుడు ఘంటసాలకి భారతరత్న రావాలన్న మీ ప్రయత్నాలకు మా అందరి తరఫున అభినందనలు.. ముఖ్యంగా ఘంటసాల కుటుంభీకులని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం, అందరినీ కలుపుకొని మాకు తెలియని చాలా విషయాలను టీవీ కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.. ఇంకా చెప్పాలి అంటే  ప్రభుత్వాలు పూనుకొని చేయాల్సిన పనిని మనమందరం  చేస్తున్నాము, ఎందుకంటే ఘంటసాల జాతీయ సంపద... స్వాతంత్ర సమరయోధుడు, వందల సినిమాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వేల పాటలు పాడటమే  కాకుండా, మన జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి మనిషి విని తీరాల్సిన భగవద్గీత ని మనందరి కోసం నిక్షిప్తం చేయడం...ఇలా అన్ని విధాలుగా వారు భారతరత్న కి అర్హులు అని తెలియచేసారు. 

హరీష్ శంకర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం గురించి ఈ మధ్యనే తెలుసుకున్నాను, ముందుగా నిర్వాహుకులందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. ఘంటసాలకు భారతరత్న వస్తే అది భారతరత్నకు ఒక అందం తప్ప వారికి కొత్త అలాంకరం ఏమి అవ్వదు అని చెబుతూ.. వారికి ఎప్పుడో వచ్చి ఉండాలని ఇంకా రానందుకు అది వారి లోపం కాదు, అది మనందరి లోపం. ఎందుకంటే వారు ఒక పరిపూర్ణ సంగీత విద్వాంసుడు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు అందిస్తే మా నాన్న నాకు ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని అందించారు, అదే నాకు మా నాన్న నుంచి నాకు వచ్చిన వారసత్వం. అందుకనే వారి విలువ తెలిసినవాళ్ళం కనుక వారు అంటే నాకు అంత గౌరవం. ఘంటసాల పాటలు, సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసి బావి తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైనా ఉందని చెబుతూ..ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ వారికి పూర్తి సహకారం అందిస్తాను అని తెలియచేసారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా చాలా గొప్ప కార్యక్రమం..ఘంటసాల మా ముందు తరాల వారికీ వారు ఒక దేవుడు, సంగీతం లో వారు ఒక గాన గంధర్వుడు. వారు ఒక మంచి గాయకుడే  కాకుండా 100 పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.. నాకు పాత సినిమాలు అన్న పాత పాటలు అన్న చాలా ఇష్టం, మరి ముఖ్యంగా ఘంటసాల పాటలు అంటే నాకు ఇంకా ఇష్టం. ఇప్పుడు కూడా టీవిలో పాత బ్లాక్ అండ్ వైట్ వస్తే సినిమాలు అలా చూస్తూ వారి పాటలు వింటాను. ఇంకా ఘంటసాల గొప్పతనం ఏమిటంటే వారి గాత్రంలో నవరసాలను పండించడం, అది ఒక భక్తి పాట అయినా, ఒక భావోద్వేగ పాట అయినా, శృంగార రసం పాట అయినా.. అలా వారి పాటలు  మన నరనరాల్లో ఇంకిపోయి మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకుపోతుంది..నాకు బాగా ఇష్టమైన, వారు సంగీత దర్శకత్వం వహించిన  రెండు సినిమాలు మాయాబజార్, గుండమ్మ కథ...ఆ సినిమాలో వారు పాడిన పాటలు ఇప్పటికి ఎప్పటికి నా ప్రియమైన పాటలు...ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడు, గాయకుడు శతజయంతి  ఉత్సవాలు జరపడం గొప్ప విషయం, మీ అందరికీ ప్రత్యేక అభినందనలు.. ఘంటసాలను  భారతరత్నతో సత్కరించుకోవడం మనందరి కనీస బాధ్యత.నేను కూడా వారికి భారతరత్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

మిమిక్రీ కళాకారుడు శివారెడ్డ, ప్రముఖ నేపథ్య గాయనీమణి గీత మాధురి, ప్రముఖ నేపథ్య గాయనీమణి మాళవిక, ప్రముఖ నేపథ్య గాయకులు, ఇండియన్  ఐడల్ రన్నర్ అప్  రోహిత్,  ప్రముఖ నేపథ్య గాయకుడు అనురూప్ తదితరులు ఘంటసాల పాటలతో వారికున్న అనుబంధాన్ని పంచుకొని చక్కని పాటలతో ప్రేక్షకులను అలరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న గౌరవం దక్కాలని మనస్ఫూర్తిగా  కోరుకున్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో యు.యెస్.ఏ. నుంచి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, శంకర్ నేత్రాలయ, బోర్డు సభ్యులు సౌమియా నారాయణ, సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు,  భారతదేశం నుంచి లక్ష్మయ్య మంత్రి తదితరులు పాల్గొని మాట్లాడుతూ,  ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిలో గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అందరూ ముక్తకంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలు కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.  ఈ కార్యక్రమముతో పాటు గతంలో ఎన్నో ఘంటసాల గారి కార్యక్రమాలకు సాంకేతిక సహాయం అందించిన ప్రమీల గోపు గారికి అభినందనలు. ఘంటసాల  కృష్ణకుమారి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెద్ది ని కలిసారు. వివరాలు వచ్చే ప్రోగ్రాములో తెలుసుకుందాము. 

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఘంటసాల కుటుంబ సభ్యులకు మరియు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ బాల రెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ప్రతి కార్యక్రమానికి సహాయాన్ని అందిస్తున్న రత్న కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి [email protected] వివరాలు పంపగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com