‘కృష్ణ వ్రింద విహారి’మూవీ రివ్యూ

- September 23, 2022 , by Maagulf
‘కృష్ణ వ్రింద విహారి’మూవీ రివ్యూ

నటీనటులు: నాగశౌర్య, షిర్లే సేథియా, రాధిక, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణన్, సత్య తదితరులు
నిర్మాణం: ఐరా క్రియేషన్స్
దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

‘ఛలో’ సినిమా తర్వాత మంచి హిట్టు చూడలేదు యంగ్ హీరో నాగశౌర్య. వరుసగా చాలా సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ, రీసెంట్‌గా ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ సినిమాలు సైతం నాగశౌర్యను నిరాశపరిచాయి. ఈ టైమ్‌లో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కసి మీదున్నాడు నాగశౌర్య. ఆ కసితోనే ప్రమోషన్లు గ్రాండ్‌గా చేశాడు. సొంత బ్యానర్ కావడంతో సినిమాపై పూర్తి బాధ్యత తానే తీసుకున్నాడు నాగశౌర్య. ఏకంగా ప్రమోషన్‌లో భాగంగా పాద యాత్ర కూడా చేసేశాడీ యంగ్ హీరో. మరి, ఇంత చేసినా సినిమా రిజల్ట్ డిసైడ్ చేయాల్సింది ఆడియన్సే కదా. ఎలా డిసైడ్ చేశారో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
ఓ అగ్రహారానికి చెందిన బ్రాహ్మణ కుర్రాడు కృష్ణ (నాగశౌర్య). సాంప్రదాయాలకు కట్టుబడి వుండే ఫ్యామిలీ వీళ్లది, తల్లి అమృతవల్లి (రాధిక) అంటే ఊర్లో అందరికీ అమితమైన గౌరవం. ఆమె ఏం చెబితే అది జరుగుతుందన్న నమ్మకం ఊరి జనానికి. కొడుకును హైద్రాబాద్ పంపించి మంచి ఉద్యోగంలో చూడాలన్న ఆమె కోరిక నిమిత్తం, కృష్ణ హైద్రాబాద్ వచ్చి ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. అక్కడ నార్త్ ఇండియన్ అమ్మాయి వ్రింద (షేర్లీ సేథియా)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఇంట్లో చెప్పకుండా పెళ్లి కూడా చేసేసుకుంటాడు. కట్ చేస్తే, వ్రిందకి ఓ విచిత్రమైన ఆరోగ్య సమస్య వుంటుంది అది వ్రింద దగ్గర దాచి పెడతాడు. నార్త్ పెళ్లాం.. సౌత్ మొగుడు. అందులోనూ పద్ధతీ ఆచారం వున్న బ్రాహ్మణ కుటుంబం. విభిన్న రుచులూ, అభిరుచులూ వున్న ఈ జంట సాఫీగా ఎలా సంసారం సాగిస్తుంది.? అనేది తెలియాలంటే ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
నాగశౌర్య మంచి నటుడు అందులో నో డౌట్. పల్లెటూరిలో బ్రాహ్మణ యువకుడిగా, సిటీలో సాప్ట్‌వేర్ వుద్యోగిగా, భార్యకూ, తల్లికీ మధ్య నలిగిపోయే భర్తగా ఇలా రకరకాల వేరియేషన్లలో తనలోని నటుడికి ఛాలెంజ్ విసిరే పాత్ర ఇది. ఛాలెంజింగ్‌గానే పూర్తి చేశాడు. మంచి మార్కులు కొట్టేశాడు. నార్త్ అమ్మాయి పాత్రలో షెర్లీ బాగుంది. స్ర్కీన్‌ పై అందంగా కనిపించింది. తల్లి పాత్రలో రాధిక తన సీనియారిటీ చూపించింది. వెన్నెల కిషోర్, రాహుల్ రామకృస్ణన్, సత్య, బ్రహ్మాజీ అవకాశం చిక్కినప్పుడల్లా తమ కామెడీ సారాన్ని మొత్తం రంగరించి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేశారు. ముఖ్యంగా కోమాలో వున్న వెన్నెల కిషోర్‌తో సత్య, రాహుల్ రామకృష్ణన్, నాగశౌర్యల కామెడీ ట్రాక్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించి మెప్పించారు.

టెక్నికల్ టీమ్ పనితీరు:
‘అంటే సుందరానికీ..’ సినిమాతో ఆల్రెడీ పరిచయం వున్న కథే అయినా, కథనాన్ని కొత్తగా నడిపించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయ్. కామెడీ చాలా బాగా కుదిరింది. మాటలు బాగున్నాయ్. సినిమాటోగ్రఫీలో భాగంగా, సింపుల్ విజువల్స్‌నే రిచ్‌గా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా కుదిరింది. ఎడిటింగ్‌ ఓకే. 

ప్లస్ పాయింట్స్:
సరికొత్త కథనం,
కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్స్, 
సెకండాఫ్

మైనస్ పాయింట్స్:
కాస్త స్లోగా నడిచిన ఫస్టాఫ్

చివరిగా:
‘కృష్ణ వ్రింద విహారి’ని కామెడీ నిలబెట్టేసింది. నాగశౌర్య ఈజ్ బ్యాక్ అనొచ్చేమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com