తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ పడబోం: కిషన్ రెడ్డి

- September 23, 2022 , by Maagulf
తెలంగాణ అభివృద్ధి విషయంలో రాజీ పడబోం: కిషన్ రెడ్డి

తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.స్వాతంత్ర్యం వచ్చాక తెలంగాణ ప్రాంతానికి రైల్వే లైన్ల విషయంలో అన్యాయం జరిగిందని, కానీ గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.9,494 కోట్లతో కొత్త రైల్వేలైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, వివిధ మార్గాల విద్యుదీకరణ తదితర అంశాల్లో ఖర్చుచేసిందని ఆయన వెల్లడించారు.

శుక్రవారం అక్కన్నపేట్-మెదక్ రైల్వేలైన్ ను కిషన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ మార్గంలో తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 17.2 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ నిర్మాణం మెదక్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, 118 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ రైల్వేలైన్ రూ.210 కోట్లతో పూర్తయిందన్నారు.ఈ సందర్భంగా రైల్వే ట్రాక్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కిషన్ రెడ్డి ధన్యవాదములు తెలియజేశారు.

మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో 298 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ల నిర్మాణం జరిగిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణకు 12 కొత్త ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రైల్వే స్టేషన్లలో అటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట పడిందని, దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు.ఇదే సమయంలో సీసీటీవీల ఏర్పాటు ద్వారా రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల భద్రత విషయంలోనూ దక్షిణమధ్య రైల్వే ప్రత్యేకంగా కృషిచేస్తోందన్నారు. 

అక్కన్నపేట-మెదక్ రైల్వే మార్గం ప్రజలకు అందుబాటులోకి రావడం ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలు పడతాయని కిషన్ రెడ్డి అన్నారు. గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేక ట్రాక్ ల నిర్మాణం జరుగుతోందని తద్వారా రైతులు తాము పండించిన పంటను దేశవ్యాప్తంగా ఎక్కడైనా విక్రయించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. వ్యాపారం పెరుగుతుందని, చుట్టుపక్కనున్న పరిశ్రమల ఉత్పత్తులను దేశం నలుమూలలకు తీసుకెళ్లేందుకు వీలవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. 

సికింద్రాబాద్-ముంబై రైల్వే లైన్ కు ఈ (అక్కన్నపేట్-మెదక్) మార్గం అనుసంధానం చేయడం ద్వారా దేశీయ మార్కెట్ తో మెదక్ ప్రజల అనుసంధానత మరింత పెరిగిందన్నారు. దీంతోపాటుగా ఏడుపాయల జాతరకు, మెదక్ చర్చిని సందర్శించేందుకు వచ్చే వారికి కూడా ఈ మార్గం చాలా ఉపయోగపడుతుందన్నారు. ఇకపై కాచిగూడ నుంచి మెదక్ కు రెగ్యులర్ గా రైళ్లు నడుస్తాయన్నారు.

మాసాయిపేట ఘటన ఇంకా మన కళ్లముందే కదలాడుతుందని.. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా  28 అండర్ బ్రిడ్జిలు, 32 ఫుటోవర్ బ్రిడ్జిల నిర్మాణం జరిగిందని ఆయన వెల్లడించారు. దీంతోపాటుగా తెలంగాణలోని 174 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని కూడా దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తోందన్నారు.

దీంతోపాటుగా గ్రీన్ ఎనర్జీ దిశగా దక్షిణ మధ్య రైల్వే తీవ్రంగా కృషిచేస్తోందన్నారు. 587 కిలోవాట్స్ పర్ ఇయర్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఇందుకు గానూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అవార్డులతోపాటు ISO: 14001 సర్టిఫికేషన్ పొందడం అభినందనీయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులు వేగవంతంగా సాగుతున్నాయని, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ పనుల వివరాలను ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. అందరం కలిసి పనిచేసినపుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. చేగుంటలో రైల్వే టికెట్ బుకింగ్ కార్యాలయం, ఆ స్టేషన్లో కొన్ని రైళ్లకు స్థాపింగ్ ఉండేలా చొరవతీసుకోవాలన్న నాయకుల డిమాండ్ పై స్పందిస్తూ.. అక్కడే ఉన్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో ఈ డిమాండ్లను త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇప్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com