సైబరాబాద్ కమీషనరేట్‌లో 'డిఫెన్సివ్ ట్యాక్టికల్ ట్రైనింగ్' ప్రారంభం

- September 26, 2022 , by Maagulf
సైబరాబాద్ కమీషనరేట్‌లో \'డిఫెన్సివ్ ట్యాక్టికల్ ట్రైనింగ్\' ప్రారంభం

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధి లోని CTC పరేడ్‌ గ్రౌండ్‌ లో ఈరోజు 30 మంది పోలీసులకు డిఫెన్సివ్ ట్యాక్టికల్ ట్రైనింగ్ ను కానిస్టేబుల్ యాదయ్య చేతుల మీదుగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర,జాయింట్ సీపీ అవినాష్ మహంతితో కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఈ ఏడాది జూలై 26వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక మహిళ ఒంటరిగా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నది. కాగా ముగ్గురు దొంగలు బైకులపై వెనుక నుంచి వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలోని చైన్ లాగి పారిపోయారు. దుండగులు దొంగతనం చేసి వస్తున్నారన్న సమాచారంతో సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు యాదయ్య, రాజు వారిని ఫాలో అయ్యారు.అశోక్ నగర్ లో ఆ దొంగలను వీరు చుట్టుముట్టారు. వెంటనే దొంగల్లో ఒకడు తన బొడ్లో దాచిన కత్తి తీసి యాదయ్యపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాడు.ఈ దాడిలో యాదయ్య దుండగుడితో ప్రతిఘటించి వీరోచితంగా పోరాడాడు. అయితే స్నాచర్చ్ చేతిలో పదునైన ఆయుధాలు ఉండడంతో దుండగుడు.. కానిస్టేబుల్ యాదయ్యను 7 సార్లు కత్తితో పొడిచాడు.ఓ వైపు రక్తం చిందుతున్నా ఆ పోలీస్ మాత్రం దొంగలను ఉడుంపట్టు పట్టి అస్సలు వదల్లేదు.ఈడ్చు కొచ్చి ఆ ముగ్గురిని కటకటాల్లోకి నెట్టారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తున్న పోలీసులు విధి నిర్వహణలో వారే ప్రాణాలు కోల్పోతున్నారు.దుండగులు తమ కార్యకలాపాలు యథేచ్ఛగా నిర్వహించుకునేందుకు అవసరమైతే పోలీసులను కాల్చి చంపుతూ వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతున్నారు.ఇటీవలి కాలంలో దుండగుల చేతిలో పోలీసులు తరచుగా గాయపడటం, ఒక్కోసారి చనిపోవడాన్ని మనం తరచూ చూస్తున్నాం.ఇటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ పోలీసులు ‘డిఫెన్సివ్ టాక్టికల్ ట్రైనింగ్’ ను ఏర్పాటు చేశామన్నారు.తాను 5 సంవత్సరాల కింద సైబరాబాద్ జాయింట్ సీపీ గా పనిచేసిన సమయంలో ఈ ట్యాక్టికల్ ట్రైనింగ్  కోర్సును రూపకల్పన చేశానని గుర్తు చేశారు.అప్పట్లో ఈ టాక్టికల్ ట్రైనింగ్ కేవలం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశారన్నారు.పోలీసులు ముందుగా తమను తాము రక్షించుకొని, ప్రజలను రక్షించుకున్నపుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.

ఇటీవల సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న యాదయ్య అనే కానిస్టేబుల్ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యారన్నారు.ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం అవ్వకుండా ఉండేందుకు ఈ టాక్టికల్ ట్రైనింగ్ దోహదపడుతుందన్నారు.సాధారణంగా పోలీసులకు ట్రైనింగ్ అఫెన్సివ్ ట్రైనింగ్ ఇస్తారని, తాము డిఫెన్సివ్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఎవరైనా మన పైన దాడి చేసినప్పుడు.. ఎలా ఆత్మ రక్షణ చేసుకోవలో, ప్రతిదాడి ఎలా చేయాలనే విషయాలు టాక్టికల్ ట్రైనింగ్ లో నేర్పిస్తారన్నారు.

సైబరాబాద్‌ పోలీసు కమీషనరేట్ లో వివిధ విభాగాలలో SOT, CCS, సైబర్ క్రైమ్స్ లా&ఆర్డర్ తదితర విభాగాలకు బ్యాచ్ కు 30 మంది చొప్పున ట్యాక్టికల్ ట్రైనింగ్ శిక్షకుడు నిశ్చల్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ TOT చేసిన 8 మంది ట్రైనర్లు మరియు ఇద్దరు ఇన్స్పెక్టర్ల బృందంతో వారం రోజులపాటు సిబ్బందికి డిఫెన్సివ్ టాక్టికల్ ట్రైనింగ్ శిక్షణ ఇస్తున్నామన్నారు.
 
ఈ సందర్భంగా జాయింట్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ... 99 శాతం అవతలి వ్యక్తి మనపై దాడి చేసే అవకాశం ఉండదని, కేవలం ఒక్క శాతం మాత్రమే దాడి చేసే అవకాశం ఉంటుందన్నారు.అయితే దుండగులకు ఆ ఒక్క శాతం అవకాశం కూడా ఇవ్వకుండా ఉండేందుకు ఈ ట్యాక్టికల్ ట్రైనింగ్ దోహదపడుతుందన్నారు.పోలీసులందరూ ఈ డిఫెన్స్ టెక్నిక్స్ అనేటివి నేర్చుకుని ఉండాలన్నారు.
 
ఈ సందర్భంగా ట్యాక్టికల్ ట్రైనింగ్ ట్రైనర్ నిశ్చల్ మాట్లాడుతూ.. 2016వ సంవత్సరంలో ట్యాక్టికల్ ట్రైనింగ్ను ప్రారంభించామన్నారు.ఈ ట్రైనింగ్ ద్వారా పోలీసులకు ఒక క్రమ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో ఫ్రిస్కింగ్, చెకింగ్, డెఫిన్సివ్ టెక్నిక్స్ ను నేర్పిస్తామన్నారు.ఈ టాక్టిక్స్ ను పోలీసులు నిరంతరం అభ్యాసం చేయడం ద్వారానే ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటాయన్నారు. కొన్ని సంఘటనలను మేం వాటిని కేస్  స్టడీస్ గా పరిగణిస్తున్నాము. వాటి నుంచి తగుపాటాలను నేర్చుకుని, మళ్లీ వచ్చే సిబ్బందికి నేర్పిస్తామన్నారు.

అనంతరం కానిస్టేబుల్ యాదయ్య మాట్లాడుతూ..దుండగులను తఃను ఎలా ఎదుర్కున్నానో,  తనపై కత్తిపోట్లను ఎలా చేశారు,అయినప్పటికీ వారిని ఎలా చట్టానికి పట్టించానో  వివరించారు.

ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి,సిసిఎస్ ఏడిసిపి నరసింహారెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, ఏసీపీ మట్టయ్య, ట్యాక్టికల్ ట్రైనింగ్ ట్రైనర్ నిశ్చల్, ఆర్ఐ సిద్ధార్థ నాయక్, ఆర్ఐ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com