శాస్త్రీయ విజ్ఞానం మానవ ప్రగతికి సంజీవని వంటిది-వెంకయ్యనాయుడు

- October 09, 2022 , by Maagulf
శాస్త్రీయ విజ్ఞానం మానవ ప్రగతికి సంజీవని వంటిది-వెంకయ్యనాయుడు

చెన్నై: శాస్త్రీయ విజ్ఞానం మానవ ప్రగతికి, పురోగతికి సంజీవని వంటిది అని, మనిషి జీవన నాణ్యతను మెరుగుపరచటంలో ఇది మరింత కీలకమని  భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని, ప్రపంచీకరణ నేపథ్యాన్ని, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వై. నాయుడమ్మ శతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఎ.సి.కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, అసోసియేషన్ ఆఫ్ లెదర్ అండ్ ఫుట్ వేర్ పూర్వ విద్యార్థులు చెన్నైలోని విజ్ఞాన్ ప్రసార్ తో కలిసి ఈ రోజు చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

భారతదేశం స్వరాజ్యాన్ని సముపార్జించుకుని 75 ఏళ్ళ మైలురాయిని చేరుకున్న తరుణంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను నిర్వహించుకుంటున్నామన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, గత 75 సంవత్సరాల భారతదేశ ప్రగతి మనందరికీ గర్వకారణమని తెలిపారు. అంతరిక్షం, అణుశక్తి, సముద్ర విజ్ఞానం, తోలు సాంకేతిక, రక్షణ పరిశోధనలు... ఇలా అనేక రంగాల్లో భారతదేశ విజ్ఞాన శాస్త్రం గొప్ప ప్రగతిని సాధించడమే గాక, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని, అత్యున్నత స్థాయి పరిశోధనలను కొనసాగిస్తూనే నూతన సవాళ్ళకు అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికాలను శాస్త్రవేత్తలకు సూచించారు.

డాక్టర్ నాయుడమ్మ జీవితం భారతీయ యువతకు, ప్రత్యేకించి గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకమనన్న  వెంకయ్యనాయుడు, ఈతరంలో ఎంతో మందికి నాయుడమ్మ గారు స్ఫూర్తిని పచుతున్నారని తెలిపారు. వారి దృక్పథం విలక్షణమైనదన్న ఆయన, కులమతాలకు అతీతంగా వారు ఉన్నత స్థాయిలో నిలిచారని తెలిపారు. నిష్కపటమైన నిజమైన శాస్త్రీయ దృక్పథమున్న వ్యక్తిగా  నాయుడమ్మను అభివర్ణించిన  వెంకయ్యనాయుడు, ప్రజల నుంచి దూరమయ్యే కొద్దిమందిని సృష్టించే బదులు, మొత్తం సమాజాన్ని సమష్టిగా ప్రోత్సహించాలన్న  నాయుడమ్మ మాటలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. 

తమ సమకాలీనులైన ఎం.ఎస్.స్వామినాథన్ మొదలుకుని లెదర్ టెక్నాలజీ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్న ప్రస్తుత విద్యార్థుల వరకూ ఐదు తరాలకు శ్రీ నాయుడమ్మ ప్రభావించ చేశారన్న శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆయన అరుదైన దృక్పథమున్న శాస్త్రవేత్త అని, తమ అభ్యాస ఫలాలను సమాజ ప్రయోజనాల కోసం అన్వయించలానుకునే దిశగా జ్ఞాన సముపార్జన కొనసాగించారని తెలిపారు. ప్రపంచ శాంతిని ప్రోత్సహించే సాధనంగా, విభజనలను తగ్గించడానికి సాంకేతికతను అముల చేయడానికి శ్రీ నాయుడమ్మ ప్రతినిధి అని ఆయన తెలిపారు.

భారతీయ తోలు పరిశ్రమ రంగంలో  నాయుడమ్మ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్న  వెంకయ్యనాయుడు, ఆయన ప్రవేశించినప్పుడు 1951లో సి.ఎల్.ఆర్.ఐ.లో కేవలం 50 వేల మంది మాత్రమే ఈ రంగం నుంచి జీవనోపాధి పొందారని, ప్రస్తుతం దాదాపు 45 లక్షల మంది, 80 వేల కోట్ల వార్షిక టర్నోవర్ తో ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, ప్రధానంగా సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి వారు కృషి చేశారని తెలిపారు. ఇది మహిళలు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించేందుకే గాక, సాధికారతను అందించిందని పేర్కొన్నారు.
 ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశ స్థానాన్ని మెరుగు పరుస్తున్న శాస్త్రవేత్తలు, పరిశోధకులను అభినందించిన  ముప్పవరపు వెంకయ్యనాయుడు, దీన్ని మరింత మెరుగు పరచాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించారు. కార్పొరేట్ రంగాలు, పరిశ్రమలు, శాస్త్రీయ సంస్థలు ఈ దిశగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా ఆర్ అండ్ డి ప్రాజెక్టులు గుర్తించి, వాటిల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ఇది నిధుల అవసరాన్ని తీర్చడమే గాక, నాణ్యత మరియు ఆవిష్కరణలను మెరుగు పరుస్తుందని తెలిపారు.
భారతీయులందరూ శాస్త్రీయ దృక్ఫథాన్ని అలవరచుకోవాలన్న  వెంకయ్యనాయుడు, మన జీవితంలో ప్రతి ప్రయత్నాన్ని దీనికి అన్వయించి, విషయ పరిజ్ఞానంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా మన జీవితంలో శాస్త్రీయ దృక్ఫథాన్ని కలిగి ఉండాల్సిన అవసరాన్ని బలోపేతం చేసిందన్న ఆయన, షేర్ అండ్ కేర్ అనే భారతీయ తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని సూచించారు. వసుధైవ కుటుంబ భావనతో ప్రపంచ అభివృద్ధి కి పని చేసే విధంగా భారతీయులు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com