'సూపర్‌స్టార్' కృష్ణ కన్నుమూత
- November 15, 2022
'సూపర్‌స్టార్' అంటూ అటు సినిమా పరిశ్రమ నుంచి , ఇటు అభిమానుల నుంచి పిలిపించుకున్న ఘట్టమనేని శివరామకృష్ణ అలియాస్ కృష్ణకు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.
దగ్గరదగ్గర 80 సంవత్సరాల జీవితాన్ని గడిపిన కృష్ణ అందులో 60 ఏళ్లకు పైగా సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. 1943లో ప్రస్తుత గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో ఆయన జన్మించారు. ఘట్టమనేని నాగరత్నమ్మ, రాఘవయ్య చౌదరి ఆయన తల్లిదండ్రులు.
రమేశ్ బాబు, పద్మావతి, మంజుల, మహేశ్ బాబు, ప్రియదర్శి లు కృష్ణ సంతానం.
తొలి సినిమా 'తేనె మనసులు'
1960లలో చిన్నచిన్న పాత్రల ద్వారా సినిమాలలో నటించడం మొదలుపెట్టిన కృష్ణ, ఆ తర్వాత తెలుగు సినిమా అగ్రనటుడిగా ఎదిగారు. ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత అప్పట్లో కృష్ణ పేరు వినిపించేది.
1965లో 'తేనె మనసులు' సినిమాతో హీరోగా కృష్ణ నట జీవితం ప్రారంభమైంది. అంతకు ముందు ఆయన కులగోత్రాలు (అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి ప్రధాన పాత్రలుగా -1961), పదండి ముందుకు ( జగ్గయ్య, గుమ్మడి, కాంతారావు ప్రధాన నటులుగా-1962), పరువు ప్రతిష్ట (ఎన్.టి. రామారావు, అంజలీ దేవి ప్రధాన నటులుగా 1963)లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు.
2016లో చివరి సినిమా
కృష్ణ హీరోగా తొలి సినిమా విడుదలై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏడాది, ఆయన కీలక పాత్రధారిగా 'శ్రీశ్రీ' పేరుతో 2016లో సినిమా విడుదలైంది. అదే ఆయన ఆఖరి సినిమా.
తెలుగు సినిమాలలో జేమ్స్‌బాండ్, కౌబాయ్ పాత్రలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నారు కృష్ణ. వీటితోపాటు పరిశ్రమలో సాంకేతికంగా అనేక కొత్త ఒరవడులకు కూడా ఆద్యుడిగా చెబుతారు. ఆంధ్రా జేమ్స్ బాండ్ అని అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు.
''కృష్ణను కొంతమంది తెలుగు సినిమా తొలి కౌబాయ్‌గా చెబుతుంటారు. కానీ, అది నిజం కాదు. దేశంలోనే తొలి కౌబాయ్ పాత్ర కృష్ణగారిదే' అని జర్నలిస్టు, ప్రముఖ సినీ విశ్లేషకుడు రంగావజ్జల భరద్వాజ అన్నారు. మొట్టమొదటి సాంఘిక కలర్ సినిమా (తేనె మనసులు), మొదటి సినిమా స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎం.ఎం చిత్రం (సింహాసనం), మొదటి డిజిటల్ థియేటర్ సౌండ్ (డీటీఎస్) మూవీ (తెలుగు వీర లేవరా)లాంటి కొత్త టెక్నాలజీలను ఆయనే తీసుకొచ్చారు.
విశాలాంధ్రతో డిమాండ్
విశాలాంధ్ర ఏర్పడిన తొలినాళ్లలో, నైజాం ప్రాంతం కూడా జత కావడంతో తెలుగు మార్కెట్ పెరిగిందని, ఈ దశలో ఇద్దరు(ఎన్టీయార్, అక్కినేని) అగ్రహీరోలతోనే సినిమా పరిశ్రమ మరిన్ని చిత్రాలు నిర్మించడం కష్టమైన పరిస్థితుల్లో కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలకు అవకాశాలు ఏర్పడ్డాయని బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషించారు.
ఎన్టీయార్ అభిమాని అయిన కృష్ణ, 'దేవదాసు' సినిమా విజయోత్సవ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు పాపులారిటీని గమనించి, సినిమాల్లో హీరోగా నటించాలన్న పట్టుదల పెంచుకున్నారని భరద్వాజ అన్నారు.
తెలుగు సినిమాల్లో అత్యధిక మల్టీ స్టారర్ చిత్రాలలో నటించిన చరిత్ర హీరోగా కృష్ణకు ఉందన్నారు భరద్వాజ. 'తొలి సినిమాకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం కల్పించగా, గూఢచారి పాత్రలతో ఆయనకు లైఫ్ ఇచ్చిన వ్యక్తి డూండి' అని ఆయన వెల్లడించారు. పోతిన డూండేశ్వర రావును డూండి అని పిలుస్తారు. విజయవాడ మారుతీ టాకీస్ యజమాని ఆయన.
ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు
తెలుగులో ఒకే హీరోయిన్(విజయనిర్మల)తో అత్యధిక సినిమాలు నటించిన హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. పద్మాలయా స్టూడియోస్ పేరుతో సినిమా నిర్మాణ రంగంలో కూడా ప్రవేశించిన కృష్ణ, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా, దర్శకుడిగా కూడా అనేక సినిమాలకు పని చేశారు. 'అల్లూరి సీతారామరాజు సినిమా మధ్యలో దర్శకుడు మరణించడంతో మిగిలిన టాకీపార్ట్ మొత్తం కృష్ణ దర్శకత్వంలోనే సాగింది' అని భరద్వాజ వెల్లడించారు.
ఎన్టీయార్ పౌరాణిక సినిమాలతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో, క్రైమ్ కథల సినిమాలతో యువతలో ముఖ్యంగా గుంటూరు ప్రాంత ముస్లిం యువతలో ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేదని భరద్వాజ వెల్లడించారు. ఇప్పటికీ ఈ కమ్యూనిటీలో కృష్ణ అభిమానులు ఎక్కువగా ఉంటారని ఆయన చెప్పారు.
ఒక్క ఏడాదిలో 17 సినిమాలు
అనేక పాత్రలలో దాదాపు 350 సినిమాలలో నటించిన కృష్ణ, కెరియర్‌లో ఒక దశలో ఒక ఏడాది ఆయన నటించిన 17 సినిమాలు విడుదలైన సందర్భం కూడా ఉంది. కృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో తేనెమనసులు తొలి సినిమా కాగా, ఈనాడు (100వ), అల్లూరి సీతారామరాజు (200వ ), తెలుగు వీర లేవరా (300వ) చిత్రాలుగా నిలిచిపోయాయి.
ఎన్టీయార్ తెలుగు దేశం పార్టీతో సంచలనాలు సృష్టిస్తున్న సమయంలో, దాదాపు అంత ప్రజాదరణ ఉన్న కృష్ణకు కాంగ్రెస్ పార్టీ అవకాశమిచ్చిందని భరద్వాజ వెల్లడించారు. 'ఏలురు నుంచి ఆయన ఒకసారి ఎంపీగా గెలిచారు. బై ఎలక్షన్లలో ఓడిపోయారు' అని భరద్వాజ తెలిపారు.
సినిమా రంగానికి ఆయన చేసిన కృషికిగాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలన చిత్రంగా పేరు తెచ్చుకున్న 'అల్లూరి సీతారామ రాజు' సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు దక్కింది. ఈ సినిమాకు కృష్ణ నిర్మాత.
'అడవి సింహాలు', 'అల్లూరి సీతారామరాజు', 'అగ్నిపర్వతం' సినిమాల్లో ఆయన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను ఎన్టీయార్ నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.
2019లో కృష్ణ సహచరి విజయనిర్మల మృతి చెందారు. ఆయన పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేశ్ బాబు ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మరణించారు. కృష్ణ భార్య ఇందిరా దేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అనారోగ్యంతో చనిపోయారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్‌లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









