నాగరికత ప్రారంభంలో వ్యవసాయమే ఆదివృత్తి -ముప్పవరపు వెంకయ్యనాయుడు

- November 20, 2022 , by Maagulf
నాగరికత ప్రారంభంలో వ్యవసాయమే ఆదివృత్తి -ముప్పవరపు వెంకయ్యనాయుడు

హైదరాబాద్: నాగరికత ప్రారంభంలో వ్యవసాయమే ఆదివృత్తిగా ఉండేదని, అక్కడి నుంచే మనిషి మనుగడ ప్రారంభమైందని అలాంటి వ్యవసాయాన్ని కాపాడుకోవటానికి ఈరంగంలో సానుకూల మార్పుల దిశగా ప్రజాఉద్యమం రావలసిన అవసరం ఉందని భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రైతునేస్తం - ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముచ్చింతల్ లో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో స్వర్గీయ డా. ఐ.వి.సుబ్బారావు స్మారక పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. ఈ పురస్కారాలను అందించటం ఎంతో ఆనందంగా ఉందన్న ఆయన, ఇది రైతులకు - వారి అభ్యున్నతికి కృషి చేసిన వారికి అందించే గౌరవం అని అభిప్రాయపడ్డారు. వీటి ద్వారా మంచిని ప్రోత్సహించగలమని, దాని ద్వారా మరెంతో మంది ముందుకు వస్తారని పేర్కొన్నారు. ఏటా ఈ పురస్కారాలను అందిస్తున్న యడ్లపల్లి వెంకటేశ్వరరావు,ముప్పవరపు హర్షవర్ధన్ కి అభినందనలు తెలియజేశారు. 

భారతదేశంలో ఉన్న వాతావరణ అనుకూలతల కారణంగా మనకు ప్రధాన వ్యత్తిగా మారిన వ్యవసాయం, ప్రకృతిహితంగా సాగటం అత్యంత ఆవశ్యకమన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, భూమి ఆరోగ్యం కోసం రసాయనాలు, పురుగుమందులు వాడే పద్ధతికి స్వస్థి పలికి పర్యావరణ హితమైన ప్రకృతి సేద్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు. సాగుబడిలో ఖర్చులను తగ్గించుకునేందుకు, మంచి రాబడిని ఆర్జించేందుకు ప్రకృతి సేద్యం చక్కని మార్గమన్న ఆయన, ప్రజలకు ఆరోగ్యం – రైతుకు రాబడి సేంద్రీయ వ్యవసాయంతో సాధ్యమౌతుందన్నారు. వ్యవసాయరంగంలో సంస్కరణలకు ఇదే మంచితరుణమన్న ఆయన, రైతులతో పాటు వ్యవసాయ రంగానికి చెందిన అధికారులు, శాస్త్రవేత్తలు సైతం ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు సైతం రైతులకు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి నిపుణుల ద్వారా శిక్షణ అందించటంతో పాటు, చేయూతను కూడా అందించాలని సూచించారు. 

సహజ వ్యవసాయం ఓ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇందుకోసం రైతులు, శాస్త్రవేత్తలు, అధికారులే కాదు... ప్రజలు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పత్రికలు సైతం ఈ విషయంలో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన, ప్రకృతి వ్యవసాయంలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణల గురించి రైతులకు వారి వారి భాషల్లో తెలియజేయటంతో పాటు, ప్రకృతి వ్యవసాయం ద్వారా లభించే పంటకు ప్రోత్సాహాన్న కల్పించాల్సిన అవసరం గురించి ప్రజల్లోనూ అవగాహన తీసుకురావాలని సూచించారు. ప్రజలు సైతం ఇంటి పంటలు, ప్రత్యామ్నాయ సేద్యరీతుల మీద దృష్టి కేంద్రీకరించాలన్న ఆయన, మిద్దెతోట ద్వారా శారీరక శ్రమ చేయటం మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని తెలిపారు. 

వ్యవసాయం మానవాళికి గొప్ప "సాయం" అనే విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజలు, అధికారులు, శాస్త్రవేత్తలు, పాత్రికేయులు గుర్తించాలని ఆకాంక్షించిన ముప్పవరపు వెంకయ్యనాయుడు, రైతులకు ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించినప్పుడు ఈరంగంలో ఎదురౌతున్న అనేక సమస్యలు పరిష్కారమౌతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పాటు, భారతదేశంలోనూ క్రమంగా జనాభా పెరుగుతున్న దృష్ట్యా అందరికీ ఆరోగ్యకరమైన చక్కని ఆహారాన్ని అందించాలంటే, రైతులకు ప్రోత్సాహం కావాలన్న ఆయన, ఈ దిశగా ప్రభుత్వాల చొరవ మరింత పెరగాలన్నారు. నీరు, విద్యుచ్ఛక్తి, ఎరువులు, పురుగు మందుల వాడకంలో సంయమనం అత్యంత ఆవశ్యకమన్న ఆయన, ఇందులో ఏది స్థాయి దాటిని రైతులకు ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోతుందన్నారు. వ్యవసాయంతో పాటు రైతులు అదనపు ఆదాయం కోసం పశువుల పెంపకం మీద దృష్టి పెట్టడం కూడా అత్యంత ఆవశ్కకమని సూచించారు. 

ఈ కార్యక్రమంలో నాబార్డ్ పూర్వ చైర్మన్ డా.చింతల గోవిందరాజులు కి జీవిత సాఫల్య పురస్కారాన్ని, తాడేపల్లి గూడెంలోని డా.వై.ఎస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. టి.జానకిరాం కి కృషిరత్న బిరుదును, అహ్మదాబాద్ బన్సీగిర్ గోశాల వ్యవస్థాపకులు  గోపాల్ భాయ్ సుతారియా కి గోపాలరత్న బిరుదును ప్రదానం చేశారు. రైతువిభాగం, శాస్త్రవేత్తల విభాగం, విస్తరణ విభాగం, వ్యవసాయ జర్నలిజం విభాగంలో పలువురికి పురస్కారాలను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో అహ్మదాబాద్ బన్సీ గిర్ గోశాల వ్యవస్థాపకులు గోపాల్ భాయ్ సుతారియా, రైతునేస్తం వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రైతునేస్తం పురస్కారాల కమిటి, నార్మ్ డైరక్టర్ డా.సి.హెచ్. శ్రీ నివాసరావు, పురస్కారాల కమిటీ సభ్యులు ప్రొఫెసర్ మల్లంపాటి శ్రీనివాస్ రెడ్డి,టి.నరసింహదాస్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com