'రైట్‌ రైట్‌' సినిమా..

- April 24, 2016 , by Maagulf
'రైట్‌ రైట్‌' సినిమా..

అతనో కండెక్టర్‌. పొద్దుట నుంచి సాయంత్రం వరకూ బస్సులోనే ప్రయాణం, బస్సుతోనే ప్రణయం. అయితే మధ్యలో 'ప్రేమ స్టాప్‌' కూడా ఉంది. ఓ అమ్మాయి కోసం అతని కళ్లు సెర్చ్‌ లైట్‌లా మారిపోయి వెదుకుతుంది. ఆ అమ్మాయికీ తనంటే ఇష్టమే. అందుకే ఇద్దరు ఆ ఎర్రబస్సులోనే ప్రేమ పాటలు పాడుకొన్నారు. ఆ బస్సులోనే హనీమూనికీ వెళ్దామనుకొన్నారు. అంతలో అనుకోని మలుపొచ్చింది. కండెక్టర్‌ జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదేంటి? ఆ తరవాత ఏం జరిగింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'రైట్‌ రైట్‌' సినిమా చూడాల్సిందే. సుమంత్‌ అశ్విన్‌, ప్రభాకర్‌, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. మను దర్శకుడు. జె.వంశీకృష్ణ నిర్మాత. 'రైట్‌ రైట్‌' ప్రచార చిత్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకులు బి.గోపాల్‌, వంశీ పైడిపల్లి, మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.అనంతరం బి.గోపాల్‌ మాట్లాడుతూ ''రైట్‌ రైట్‌ అన్నది సుపరిచితమైన పదం. మంచి టైటిల్‌ పెట్టడంలోనే సగం విజయం ఉంది. ఈ చిత్రం సుమంత్‌కి మంచి విజయాన్ని అందివ్వాలి. ఎమ్మెస్‌ రాజు చేతుల మీదుగా ఎంతోమంది దర్శకులు వెలుగులోకి వచ్చారు. ఈ సినిమాతో మనుకీ మంచి పేరు రావాల''ని ఆకాంక్షించారు. మారుతి చెబుతూ ''సినిమాపై ఫ్యాషన్‌ ఉన్న టీమ్‌ ఇది. పోస్టర్‌ చూసినప్పుడే కొత్తగా ఫీలయ్యా. సుమంత్‌ అశ్విన్‌ రొటీన్‌కి భిన్నంగా కొత్త కథలతో ప్రయాణం సాగిస్తున్నాడు. తన ఖాతాలో ఈ చిత్రంతో మరో విజయం చేరాల''ని ఆకాంక్షించారు. ''సుమంత్‌ మంచి దర్శకుడు అవుతాడనుకొన్నా. నటుడిగా మారి షాక్‌ ఇచ్చాడు. అయితే తాను ఎంచుకొన్న దారిలో విజయం సాధించడం ఆనందాన్నిచ్చింద''న్నారు వంశీపైడిపల్లి. ''డ్రైవర్‌, కండక్టర్‌ మధ్య జరిగే కథ ఇది. ప్రభాకర్‌ నటన చూసి అంతా ఆశ్చర్యపోతారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు దర్శక నిర్మాతలు. సంగీతం: జె.బి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com