టీడబ్ల్యూఏ చొరవతో ఇండియాకు రాజేశం

- December 29, 2022 , by Maagulf
టీడబ్ల్యూఏ చొరవతో ఇండియాకు రాజేశం

దోహా: తెలంగాణలోని జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గుగ్గిల్ల రాజేశం(36) గత మూడు నెలల క్రితం ఖతార్ వెళ్లి ఒక క్లీనింగ్ కంపెనీలో క్లీనర్ గా పనిచేస్తున్నాడు.  ఈ క్రమంలో అనుకోకుండా ఒకరోజు కడుపు మీద గాయమై తీవ్రమైంది. హాస్పిటల్ పొదామంటే హెల్త్ కార్డు లేదు. చేతిలో అంత డబ్బులు లేక  ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను పనిచేస్తున్న కంపెనీ దృష్టికి తీసుకు వెళ్లగా.. జాయిన్ అయి 3 నెలలు మాత్రమే అయిందని, ఇంత తొందరగా ఇంటికి పంపలేమని,  సొంత డబ్బులతోనే ఆస్పత్రిలో చూపించుకోవాలని స్పష్టం చేశారు.

దీంతో దిక్కుతోచని పరిస్థితిలో తన గ్రామస్థుడైన పోచంపల్లి నర్సయ్యకు బాధ చెప్పుకోగా.. ఆయన స్పందించి గల్ఫ్ జేఏసీ చైర్మైన్ గుగ్గిల్ల రవి గౌడ్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. అనంతరం రాజేశంతో ఫోన్లో మాట్లాడి సమస్య తెలుసుకున్న జేఏసీ చైర్మన్ రవిగౌడ్ వెంటనే ఖతార్ లో ఉన్న తమ గల్ఫ్ జేఏసీ నాయకులు, తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్(టీడబ్ల్యూఏ) ఖతార్ అధ్యక్షుడు ఖాజా నిజామోద్దీన్ కు ఫోన్ చేసి వివరాలు చెప్పాడు. వీలైనంత తొందరలో రాజేశం సమస్య పరిష్కరించాల్సిందిగా కోరాడు.

వెంటనే స్పందించిన ఖాజా నిజామోద్దీన్ కొన్ని గంటల్లోనే రాజేశం దగ్గరకు చేరుకొని ముందుగా హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు ఇండియాకి పంపించాల్సిందిగా చెప్పడంతో రాజేశం పనిచేస్తున్న కంపనీ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించాడు. చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతున్న రాజేశం ఇబ్బందులను గుర్తించిన టీడబ్ల్యూఏ ఉపాధ్యక్షులు గులాం రసూల్ టికెట్ కొనియ్యడంతోపాటు చేతి ఖర్చులకు దాదాపు 20,000 రూపాయలు ఇచ్చి నిన్న ఇండియాకు పంపించారు. ఆపద సమయంలో ఆదుకున్న తెలంగాణ వెల్పేర్ అసోసియేషన్ కు, గుగ్గిల్ల రవి గౌడ్ కి బాధితుడు రాజేశం, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com