సైబర్ నేరాల నిరోధానికి కమాండ్ కంట్రోల్ దోహదం-టి.హోమ్ మంత్రి
- January 11, 2023
            హైదరాబాద్: రోజురోజుకు అప్రతిహాతంగా పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ దోహదపడుతుందని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు.సైబర్ నేరాల నిరోధం, అవగాహన కల్పించేందుకై రాష్ట్రంలోని 2385 పాఠశాలల్లో సైబర్ అంబాసడర్ ప్లాట్ఫామ్ కార్యక్రమాన్ని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ నేడు ఉదయం రవీంద్ర భారతిలో డీజీపీ అంజనీ కుమార్, మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర గురుకుల పాఠశాలల కార్యదర్శి రోనాల్డ్ రోస్, డి.ఐ.జి బడుగుల సుమతి లతోకలసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా హోమ్ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణా రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతకు సి.ఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, దీనిలో భాగంగా దాదాపు రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ టవర్ ద్వారా సైబర్ ఆధారిత నేరాలన్నింటికీ అడ్డుకట్ట వేసే అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ యువత, విద్యార్థులపైనే ఉందని, సమాజానికి ముప్పుగా పరిణమించిన సైబర్ నేరాలపట్ల సమాజంలోని పెద్దలందరికీ అవగాహన కల్పించాల్సిన భాద్యత యువతపై ఉందని అన్నారు.
డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం నిర్వహిస్తున్న పోలీస్ పెట్రోలింగ్ మాదిరిగానే సైబర్ పెట్రోలింగ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు. కోవిద్ నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటర్నెట్ వాడకం పాఠశాల పిల్లల స్థాయి నుండి అన్ని వర్గాల్లో గణనీయంగా పెరిగిందని, అదే మాదిరిగా సైబర్ నేరాలు కూడా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ సెఫిటీ పై ఏర్పాటు చేసిన సైబ్-హర్ కార్యక్రమంలో భాగంగా 2021 -22 లో రాష్ట్రంలోని 1650 పాఠశాలల విద్యార్థులకు శిక్షణ నివ్వడం జరిగిందని, తిరిగి సైబర్ అంబాసడర్ ప్లాట్ఫామ్ కార్యక్రమంలో తిరిగి 2385 పాఠశాలల్లోని విద్యార్థులకు చైతన్య, అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మెరుగైన పోలీసింగ్ ద్వారానే ప్రపంచంలో ప్రముఖ కంపెనీలైన మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు ప్రారంభించాయని అన్నారు. అదేవిధంగా సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని వెల్లడించారు.
మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్ మాట్లాడుతూ, భౌతిక (ఫిజికల్ ) పరమైన భద్రతను ఏవిధంగానైతే తీసుకుంటున్నామో సైబర్, డిజిటల్ పరంగా తగు భద్రతా చర్యలను పాటించాలని సూచించారు. డిజిటల్, సైబర్ పరంగా చేయకూడనివి, చేయాల్సిన చర్యలపై రాష్ట్రం లోని పాఠశాల పిల్లలకు పెద్ద ఎత్తున శిక్షణా కార్యక్రమాలను ఇస్తున్నామని వివరించారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలో మాదిరిగానే ఇంటర్మీడియట్ కళాశాలలోనూ సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై సైబర్ అంబాసడర్ లకు శిక్షణ నివ్వాలని విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల కార్యదర్శి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలల్లో చైల్డ్, సైబర్ సెక్యూరిటీ పై ప్రత్యేక శిక్షణ నిస్తున్నామని వెల్లడించారు. డీఐజి సుమతి మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రంలో 3 .25 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై ప్రత్యేక శిక్షణ నివ్వడం జరిగిందని వెల్లడించారు.
ఈ సందర్బంగా, సైబర్ అంబాసడర్ ప్లాట్-ఫామ్ కార్యక్రమం లోగోను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. సైబర్ అంబాసడర్ ప్లాట్-ఫామ్ పై ముద్రించిన ప్రత్యేక బుక్ ను డీజీపీ అంజనీ కుమార్, పోస్టర్ ను అడిషనల్ డీజీ షికా గోయల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చల్లా రాజేంద్ర ప్రసాద్, మహిళా భద్రతా విభాగం ఎస్.పి రఘువీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 - బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 







