రాజా చెయ్యి వేస్తే చిత్రం రివ్యూ
- April 29, 2016
నటీనటులు: నారా రోహిత్, ఇషా తల్వార్, తారకరత్న, శివాజీ రాజా తదితరులు సాంకేతికవర్గం సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: భాస్కర్ సామల, మాటలు: శంకర్, నిర్మాణం: సాయి కొర్రపాటి, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి. పతాకం: వారాహి చలన చిత్రంవిడుదల: 29 ఏప్రిల్ 2016మెరుపు వేగంతో దూసుకుపోతున్న కథానాయకుడు నారా రోహిత్. జయాపజయాలతో సంబంధం లేకుండా నెలల వ్యవధిలోనే ఆయన కొత్త సినిమాలతో సందడి చేస్తుంటాడు. ఇటీవలే 'సావిత్రి', 'తుంటరి' చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఆ పరంపరలో 'రాజా చెయ్యి వేస్తే' అంటూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నారా రోహిత్. తారకరత్న ప్రతినాయకుడిగా నటించడంతో నారా, నందమూరి కాంబినేషన్ అంటూ అందరి దృష్టీ ఈ సినిమాపైనే పడింది. మరి ఈ కథలో రాజా ఎవరు? ఎవరెలా ఎవరిపై చేయివేశారో తెలుసుకొందాం పదండి!కథేంటంటే?: దర్శకుడు కావడమే లక్ష్యంగా పెట్టుకొన్న యువకుడు రాజారామ్ (నారా రోహిత్). సహాయ దర్శకుడిగా కొనసాగుతుంటాడు. ఇంతలో చైత్ర(ఇషాతల్వార్)ని చూసి మనసు పారేసుకొంటాడు. ఎప్పటికైనా తనదైన ఓ యాక్షన్ కథని తెరపై చూసుకోవాలని కలలుగంటూ, తన ప్రియురాలైన ఛైత్రకి ఓ కాఫీషాప్‌లో ఓసారి కథ చెబుతాడు. ఆ మరుసటి రోజే రాజారామ్‌కి ఓ ఉత్తరం వస్తుంది. తనని తాను దర్శకుడినని పరిచయం చేసుకొంటూ నిన్న మీరు చెప్పిన కథ నచ్చిందని, ఓ మంచి ప్రేమకథ రాసి పంపమని అందులో వుంటుంది. ప్రేమకథలంటే ఇష్టం లేకపోయినా తన ప్రేమకథనే రాసి దర్శకుడికి పంపుతాడు రాజారామ్. ఇంతలో మరో ఉత్తరం ఆ దర్శకుడి నుంచి అందుతుంది. మీరు పంపిన ప్రేమకథ బాగుంది కానీ... అర్జంటుగా ఒక యాక్షన్ కథని తెరకెక్కించాల్సి వచ్చిందని, దానికి క్లైమాక్స్ సన్నివేశాలు రాసి పంపమని దర్శకుడు చెబుతాడు. ఆ సన్నివేశాల్ని రాసి పంపిన మరుసటి రోజే రాజారామ్‌కి ఓ కొరియర్ వస్తుంది. నీవు రాసిన క్లైమాక్స్‌లాగే విజయ్ మాణిక్ (తారకరత్న)ని చంపేయాలని, లేదంటే నేను నిన్ను చంపేస్తానని రాసిన ఉత్తరంతో పాటు, అందులో ఓ గన్ కూడా వుంటుంది. మరి రాజారామ్ అందుకు ఒప్పుకొన్నాడా లేదా? ఇంతకీ విజయ్ మాణిక్ ఎవరు? అసలు రాజారామ్‌తోనే ఆ హత్య ఎందుకు చేయించాలనుకొన్నాడు ఆ దర్శకుడు. నిజంగా ఆ కొరియర్ పంపించింది దర్శకుడేనా? తదితర విషయాలన్నింటినీ తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ తెలివిగా హత్యలు చేసి తప్పించుకొనే ఓ ప్రతినాయకుడిని మట్టుబెట్టే ఓ కథానాయకుడి కథే ఇది. ఒక సాదాసీదా కథకి స్క్రీన్‌ప్లే పేరుతో బోలెడన్ని హంగులు జోడించారు. దీంతో అడుగడుగునా మలుపులు, తర్వాత ఇంకేదో జరిగిపోతోందన్న బిల్డప్‌తో సన్నివేశాలు సాగిపోతుంటాయి. కానీ తెరపై కనిపించినంత హంగామాకి తగ్గ భావన మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలో కలగదు. తొలి సగభాగం కథానాయకుడి స్నేహితులు, అతడి ప్రేమ వ్యవహారం చుట్టూనే సాగిపోతాయి. ఇదంతా కాలక్షేపం వ్యవహారంలా అనిపిస్తుంది. మలి సగభాగంలోనే అసలు కథ మొదలవుతుంది. దర్శకుడైతే బోలెడన్ని మలుపులతో సన్నివేశాల్ని రాసుకొన్నాడు కానీ... వాటిని అంతే థ్రిల్‌గా తెరపైకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. బ్రెయిన్‌ని గన్‌లా వాడితే ఆలోచనలు బుల్లెట్‌లా దూసుకెళ్తాయని నమ్మేవాడే ఇందులో కథానాయకుడు. కానీ ఆ మాటలకి తగ్గట్టుగా మాత్రం ఆ పాత్రని తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు. కథానాయకుడి నిర్ణయాల్లోనూ, ఆలోచనల్లోనూ ఎక్కడా ఇంటెలిజెన్స్ కనిపించదు. అలాగే తప్పు చేయమని నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని అమ్మ చెప్పలేదు... నాకు తోచిందే చేసుకొంటూ వెళ్తుంటే జనం దాన్నే తప్పు అంటారు అని ఫీలయ్యేవాడు ఇందులో విలన్. కానీ అంత సంఘర్షణ తారకరత్న పోషించిన విలన్ పాత్రలో కనిపించదు. దీంతో ఆ పాత్ర ఓ సాదాసీదా విలన్‌గా మారిపోయింది. ఇలా తెరపై కనిపించే ప్రతీ పాత్ర కూడా పట్టుతప్పింది. కథ, నేపథ్యం, నటీనటులు ఇలా అన్ని దినుసులూ బాగానే పడినా వంటకం మాత్రం కుదర్లేదు.ఎవరెలా చేశారంటే?: నారా రోహిత్ ఎప్పట్లాగే తన పాత్రలో ఒదిగిపోయాడు కానీ... ఆ భారీకాయంతో కెమెరా ముందు కాస్త కష్టంగా కదిలినట్టు అనిపిస్తుంది. పాటలు, పోరాట ఘట్టాల్లో ఆ విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతుంటుంది. తారకరత్న ప్రతినాయకుడిగా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు. ఇషా తల్వార్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో ఆమె పాత్ర కీలకమైనా, తెరపై చాలాసేపు కనిపించినా ఏ దశలోనూ ప్రేక్షకుల్ని ప్రభావితం చేయలేకపోయింది. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. సాయికార్తీక్ సంగీతం పర్వాలేదు. కెమెరా పనితనం కూడా బావుంది. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. దర్శకుడు రాసుకొన్న కథ బావుంది కానీ... దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మాత్రం బాగోలేదు.బలాలు కథ నేపథ్యం మలుపులు నారారోహిత్, తారకరత్నల నటబలహీనతలు తొలి సగభాగం పట్టుతప్పిన కథనం చివరిగా: రాజా చెయ్యి వేసినా...గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







