తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తా: సుధీర్ బాబు

- May 03, 2016 , by Maagulf
తెలుగులో విలన్ పాత్రలు పోషిస్తా: సుధీర్ బాబు

తెలుగులో విలన్‌ పాత్ర చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతం లేదంటున్నాడు టాలీవుడ్‌ నటుడు సుధీర్‌ బాబు. సుధీర్‌బాబు విలన్‌గా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'బాఘీ' ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత బాలీవుడ్‌ నటీనటులు ఫోన్‌ చేసి చిత్రంలోని తన నటనను మెచ్చుకున్నారని.. వారి ప్రశంసలు తనలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయని అంటున్నాడు.
సినీ కెరీర్‌ ప్రారంభంలో 'ఏం మాయ చేశావో' చిత్రంలోను చిన్న నెగిటివ్‌ పాత్రలో నటించానని తెలిపాడు. త్వరలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారని.. అందులో గోపిచంద్‌ పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ చిత్ర స్క్రిప్టు ప్రస్తుతం ప్రారంభదశలో ఉందని.. త్వరలోనే ఈ చిత్రం పూర్తి వివరాలను తెలియజేస్తామన్నాడు. తనకు బ్యాడ్మింటన్‌ బాగా వచ్చని ఆ పాత్రలో నటించడం కష్టమేమి కాదన్నాడు.
సుధీర్‌బాబు విలన్‌గా నటించిన బాలీవుడ్‌ చిత్రం 'బాఘీ' మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతుంది. చిత్రంలో బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటించారు. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే రూ.45.30కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌ తొలిరోజు వసూళ్లలో 'ఫ్యాన్‌', 'ఎయిర్‌లిఫ్ట్‌' తరువాత బాఘీ మూడో స్థానంలో నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com