మంత్రి కేటీఆర్ తో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి సమావేశం
- March 13, 2023
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కే.తారక రామారావు ఈరోజు విజ్ఞప్తి చేశారు. ప్రగతిభవన్‌లో తనతో సమావేశమైన యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి కి ఈ మేరకు మంత్రి కేటీఆర్ పలు వివరాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్ లో ఒక కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు 15 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తాను నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు తెలిపారు. షరియా చట్టంలోని (Diyyah) ప్రకారం బాధితుల కుటుంబం (blood money తీసుకుని) క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయం తో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటీషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు.
ఈ మేరకు తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు.ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయ్ లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు.
మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అనేక ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతుల వలన భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న ఆశాభావాన్ని అబ్దుల్ నసీర్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం మరియు ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్ కు పరిచయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి, ఈ మేరకు తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్ట్ అప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







