బిజెపియేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు సిఎం స్టాలిన్ లేఖ

- April 13, 2023 , by Maagulf
బిజెపియేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు సిఎం స్టాలిన్ లేఖ

న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బిజెపియేతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించాలని స్టాలిన్ పేర్కొన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తి మసకబారడాన్ని చూస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం గవర్నర్ పాత్రతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించిందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రభావితం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన వివిధ బిల్లులను నేడు కొందరు గవర్నర్లు నిరవధికంగా ఉంచుతున్నారన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఆయా ప్రాంతాలలో రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేస్తుందన్నారు.

‘బిల్ టు బ్యాన్ ఆన్‌లైన్ రమ్మీ’ సహా ఆమోదం కోసం పంపిన బిల్లులపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడానికి తాము అనేక ప్రయత్నాలు చేసామన్నారు. తమ ప్రయత్నాలు విఫలమైనందున అనేక ఇతర రాష్ట్రాలకు ఇలాంటి సమస్యలు ఉన్నాయనేది తెలుసుకున్నామని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడులో తాము గవర్నర్‌లకు కాలపరిమితిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రపతిని కోరుతూ మా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం సరైనదని భావించామన్నారు. తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తీర్మాన సారాంశాన్ని మీ పరిశీలన కోసం జత చేస్తున్నానన్నారు. తీర్మానం స్ఫూర్తి, అందులోని అంశాలతో ఏకీభవిస్తారని.. మీ రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు, శాసనసభల సార్వభౌమాధికారం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మీ మద్దతును అందిస్తారని భావిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com