ఏజెంట్ల చేతిలో మోసపోయిన భారతీయ మహిళ.. అండగా నిలిచిన ఎంబసీ

- April 13, 2023 , by Maagulf
ఏజెంట్ల చేతిలో మోసపోయిన భారతీయ మహిళ.. అండగా నిలిచిన ఎంబసీ

బహ్రెయిన్: ఉద్యోగం ఇప్పిస్తానని ఎంప్లాయ్ మెంట్ ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్‌కు వచ్చి మోసపోయిన భారత్‌కు చెందిన ఓ మహిళను భారత రాయబార కార్యాలయం సురక్షితంగా రక్షించి తిరిగి ఇండియాకు పంపింది. వివరాల్లోకి వెళితే.. నార్త్ గోవా జిల్లాలోని తిస్వాడి నివాసి అయిన 23 ఏళ్ల యువతి మంగళవారం దుబాయ్ మీదుగా ప్రయాణించి ఢిల్లీలో సురక్షితంగా దిగింది. ఆమె ఫిబ్రవరిలో ఏజెంట్ల ద్వారా బహ్రెయిన్ చేరుకున్నది. ఎంప్లాయ్ మెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదిరిన ఉద్యోగంలో కాకుండా.. ఆమెను గృహ సహాయకురాలుగా నియమించారు. అయితే, సదరు ఇంటి యజమాని వద్ద ఆమె పనిచేయడానికి నిరాకరించింది. దీంతో ఆమెపై దొంగతనం కేసు నమోదు చేయించారు. మొబైల్ ఫోన్‌ను లాక్కోని వేధింపులకు గురిచేశారు. అనంతరం ఆమె బహ్రెయిన్‌లోని ఎంబసీ అధికారులను సంప్రదించింది. ఆమె తన కేసు గురించి భారత రాయబార కార్యాలయానికి తెలియజేసింది. రాయబార కార్యాలయం భారతదేశంలోని ఆమె బంధువులను సంప్రదించింది. ఆ తర్వాత ఆమె మామ ముంబై క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో క్రైం బ్రాంచ్ అధికారులు జాబ్ ఏజెంట్లతో సంప్రదించారు. ఇదే సమయంలో అధికారులు గల్ఫ్-మహారాష్ట్ర బిజినెస్ ఫోరమ్ నుండి కూడా సహాయం కోరారు. చివరకు పోలీసులు, ఎంబసీ అధికారులు, ఫోరం కృషి ఫలించడంతో బాధిత మహిళ క్షేమంగా భారత్‌కు తిరిగివచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com