చైన్ స్నాచర్లను ఉపేక్షించేది లేదు: కమిషనర్ చౌహాన్

- April 13, 2023 , by Maagulf
చైన్ స్నాచర్లను ఉపేక్షించేది లేదు: కమిషనర్ చౌహాన్

హైదరాబాద్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ అధికారులను సూచించారు.ఈరోజు రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ మరియు క్రైమ్ విభాగ అధికారులు మరియు సిబ్బందితో కమిషనర్ డి.ఎస్ చౌహాన్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ..ఆధునిక సాంకేతిక కాలంలో, అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాల వల్ల సైబర్ నేరాల శాతం పెరుగుతొందని తెలిపారు. వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని, కానీ అదే సమయంలొ ప్రజలు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి వుండాలి అని పేర్కొన్నారు. సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరిగేలా యువత భాగస్వామ్యంతో కళాశాలలు మరియు ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.నకిలీ లాటరీలు, నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సుల వంటి పేరుతో ప్రజలను మోసం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని కమిషనర్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టకూడదని అధికారులకు సూచించారు.

పోలీసుల కృషి, కఠిన చర్యల వల్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలో  చైన్ స్నాచర్ల బెడద చాలా వరకు తగ్గిందని, మహిళలు ప్రశాంతంగా బయటకు వెళ్లి తమ పనులు చేసుకుంటున్నారని కమిషనర్ తెలిపారు. చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా అధికారులు సిబ్బంది కలసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది కలసి సమన్వయంతో పనిచేస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో డీసీపీ సైబర్ క్రైమ్స్ అనురాధ, డీసీపీ క్రైమ్ మధుకర్ స్వామి, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశం, ఇన్స్పెక్టర్ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com