జర్నలిస్ట్ డైరీ అవార్డుల ప్రదానం చేసిన వెంకయ్యనాయుడు
- April 15, 2023
హైదరాబాద్: న్యూస్, వ్యూస్ ను కలప రాదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. పాత్రికేయ వృత్తిలో ఉత్తమ ప్రమాణాలు,విలువలు పాటించాలని హితవు పలికారు.శనివారం ఆయన జర్నలిస్టు డైరీ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు వెంకయ్యనాయుడు జర్నలిస్ట్ డైరీ పురస్కారాలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పార్టీని బట్టి పత్రికల్లో వచ్చే వార్తలు మారిపోతున్నాయని, పార్టీలే పత్రికలు పెట్టుకుంటున్నాయని అన్నారు. చరిత్రలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేస్తూ ఈ చొరవే ప్రజల్లో పాత్రికేయుల పట్ల, మీడియా సంస్థల పట్ల అభిమానాన్ని పెంచాయన్నారు.ముఖ్యంగా స్వరాజ్య సమరంలో పత్రికలు, పాత్రికేయులు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. తెలుగు సాహిత్యం, చరిత్ర, పత్రికలు లేకుండా పరిపూర్ణం కాలేదన్నారు.ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్లో మినహా గతంలో పత్రికలు వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వర్తిన్చాయని చెప్పారు.ఎమర్జెన్సీ సమయం లోనూ రామ్ నాథ్ గోయెంకా సారథ్యంలోని ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’, సి.ఆర్. ఇరానీ సారథ్యంలోని ‘ద స్టేట్స్ మన్’, నిఖిల్ చక్రవర్తి సారథ్యంలోని ‘మెయిన్ స్ట్రీమ్’ మేగజీన్ వంటివి అధికార పక్షానికి ఆ రోజుల్లో ఎదురొడ్డి నిలిచాయి అని చెప్పారు.
సమాజంలో మంచి సేవలు అందిస్తున్న వారిని గుర్తించడం కూడా ఉత్తమ పాత్రికేయ లక్షణమని చెప్పారు. అలాంటి వారిని గుర్తించి అవార్డులు అందించిన సతీష్ అభినందనీయుడు అన్నారు. ఎలక్షన్ కన్నా ముందు సెలెక్షన్ ముఖ్యమని చెప్పారు. సెలెక్షన్లో 4సీలను- కేరక్టర్, కండక్ట్, కేలిబర్, కెపాసిటీలను గుర్తించాలని చెప్పారు. మానవ సేవే మాధవ సేవ అని,షేర్ అండ్ కేర్ అనేది భారతీయ సంస్కృతి అని, మనకు ఉన్న సంపదను, విద్యను నలుగురితో పంచుకోవడంలో అనిర్వచనీయమైన ఆనందం ఉంటుందని చెప్పారు. అలాంటి నిస్వార్థ సేవకులకు అవార్డులు అంద చేయడం ఆనందంగా ఉందన్నారు. అవార్డులు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అందరికీ స్ఫూర్తిని కలిగించడమే అవార్డుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
చేసేది సత్కార్యమయితే అది ఉన్నత కార్యంగా అందరి మన్ననలు అందుకోవటమే కాకుండా మరెంతో మందిలో ప్రేరణ నింపి ఆ పని తరతరాలు నిలిచిపోతుందని వెంకయ్యనాయుడు చెప్పారు.ఈ రోజు ఈ వేదిక మీద ఉన్న వివిధ రంగాల ప్రముఖులు అలాంటి వారేనని వారి ప్రస్థానం ఒకరి నుంచి స్ఫూర్తిని పొందకుండా ముందుకు సాగలేదని అన్నారు. ప్రేరణ పొందే స్థాయి నుంచి ప్రేరణగా నిలిచే స్థాయికి వారంతా ఎదిగారని ప్రశంసించారు.ఇది ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలన్నారు. ఇలాంటి వారి ప్రేరణతో మరెంతో మంది యువత, పిల్లలు ఆయా రంగాల వైపు ఆకర్షితులౌతారని, తాము కూడా అంతగా ఎదగాలని పరితపిస్తారని, దేశ అభివృద్ధి గమనంలో ఇదే కీలకమని చెప్పారు. అవార్డులు అందుకున్నవారిలో శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు డాక్టర్ జి.న్. రావు, సామాజిక కార్యకర్త సునీత క్రిష్ణన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాజేశ్ టచ్ రివర్, ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్, గాయని మంగ్లీ, డాక్టర్ వింజమూరి సూర్యప్రకాశ్, ఎం.బీ.ఎస్ ప్రసాద్,బి.శివప్రసాద్, డి.అపర్ణ, భారత క్రికెట్ జట్టు సభ్యురాలు త్రిష ఉన్నారు.
ఈ కార్యక్రమంలో అతిథి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాస రెడ్డి, జర్నలిస్ట్ డైరీ వ్యవస్థాపకులు సతీశ్ బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.



తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







