పీఎఫ్ చందాదారులకు కొత్త స్కీమ్!

- May 09, 2016 , by Maagulf
పీఎఫ్ చందాదారులకు కొత్త స్కీమ్!

కేంద్రం కసరత్తు లోక్‌సభలో బండారు దత్తాత్రేయ ప్రకటన  న్యూఢిల్లీ: రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థ- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) చందాదారులకు తక్కువ ధరకు గృహ సౌలభ్యం కల్పించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈపీఎఫ్‌ఓలో దాదాపు ఐదు కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చల స్థాయిలోనే ఉందని మంత్రి తెలియజేశారు. 'తక్కువ ధర ఇండ్ల కొనుగోలుకు ఒక ఉద్యోగి తమ భవిష్య పీఎఫ్ హామీ' సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. నిజానికి ఈ అంశం గత ఏడాది సెప్టెంబర్ 16 ఈపీఎఫ్‌ఓల ట్రస్టీల సమావేశంలో చర్చకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.

దీనిపై ఏర్పాటయిన ఒక నిపుణుల కమిటీ తన నివేదికను ట్రస్టీలకు సైతం సమర్పించిందన్నారు. కమిటీ నివేదిక పథక రూపకల్పనకు సానుకూలంగానే స్పందించిందనీ పేర్కొన్నారు. ప్రతిపాదిత పథకం ప్రకారం- పీఎఫ్ సభ్యుడు, బ్యాంక్ (లేదా హౌసింగ్ ఏజెన్సీ), ఈపీఎఫ్‌ఓల మధ్య 'భవిష్య పీఎఫ్ ఈఎంఐ పేమెంట్లకు' సంబంధించి ఒక అవగాహన ఏర్పడాల్సి ఉంటుందన్నారు. గృహ, పట్టణ పేదరిక నిర్మూలనా మంత్రిత్వశాఖ నుంచి లభించే ప్రయోజనాలు సైతం లబ్ధిదారులకు లభించేలా పథకం రూపొందించాలని నిపుణుల కమిటీ సూచించిందన్నారు. 
 నిర్వహణలోలేని అకౌంట్లలో రూ.43,000 కోట్లు  ఇదిలావుండగా, ఈపీఎఫ్‌ఓకు సంబంధించి నిర్వహణలోలేని ఎకౌంట్లలో రూ.43,000 కోట్లు ఉన్నట్లు మంత్రి సభకు తెలిపారు. వస్తున్న వడ్డీసైతం ఆయా అకౌంట్లలోనే జమ చేస్తున్నట్లు వెల్లడించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 1.18 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించినట్లు చెప్పిన మంత్రి, వీటిలో 98 శాతం 20 రోజలు వ్యవధిలోనే పూర్తయినట్లు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com