చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ
- April 29, 2023
హైదరాబాద్: ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మళ్లీ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ సమావేశం అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడం జరిగింది. గతంలో వైజాగ్ లో పవన్ కల్యాణ్ పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం, ఆరోజు జరిగిన ఘటనలకు సంబంధించి విజయవాడ నోవాటెల్ హోటల్ కి ప్రత్యేకంగా వెళ్లి పవన్ ను పరామర్శించారు చంద్రబాబు. ఆ తర్వాత హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్.. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేయాలని అప్పుడే చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జీవో 1పై విరుచుకుపడ్డారు.
ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పని చేస్తామని మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్ చెప్పారు. కేవలం రాజకీయ పరిణామాలపైన మాత్రమే చర్చించామని, పొత్తుల గురించి చర్చ జరగలేదని నాడు వారిద్దరూ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు నాడు చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఎక్కడా తిరగనివ్వడం లేదని.. సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం లేదని, ఏపీలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన నడుస్తోందని గతంలో చంద్రబాబు, పవన్ చెప్పారు. అదే సమయంలో, ఇకపై తాము తరుచుగా కలుసుకుంటామని ఆ రోజే పవన్, చంద్రబాబు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ భేటీ అయినట్లు తెలుస్తోంది.
ఇక, ఇటీవల ఎర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగ్గా, ఆ సమయంలోనూ పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకి మద్దతుగా, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
అప్పటి నుంచి చంద్రబాబుని కలవాలని పవన్ అనుకుంటున్నారు. అయితే షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల సాధ్యం కాలేదు. ఇవాళ(ఏప్రిల్ 29) చంద్రబాబు నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. నిన్న ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ఇవాళ మధ్యాహ్నమే హైదరాబాద్ చేరుకున్నారు. పలు కీలక అంశాలపై వీరిద్దరూ చర్చిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







