ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన అనంతరం కీలక ప్రకటన చేసిన సిద్ధరామయ్య, డీకే
- May 18, 2023
బెంగళూరు: కర్ణాటక హైడ్రామా ముగిసింది. మూడు రోజులపాటు సాగిన ఉత్కంఠకు తెర దించుతూ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇక డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఈ విషయమై గురువారం మద్యాహ్నం కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం పోటాపోటీగా తలపడ్డ సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు ఈ పరిణామం అనంతరం తమ ఐక్యతను చాటుకోవడం గమనార్హం. ‘మా చేతులు ఎప్పుడూ కలిసే ఉంటాయి’ అంటూ ఇరు నేతలు ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు.
కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గేతో చేతులు కలిపి విజయ సంకేతాన్ని చూపుతున్న ఫొటోను సిద్ధరామయ్య తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘కర్ణాటక సంక్షేమాన్ని కాపాడేందుకు మా చేతులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. ప్రజానుకూలమైన, పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించడంతో పాటు మా హామీలన్నింటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలా పని చేస్తుంది’’ అని ట్వీట్ చేశారు.
ఇక ఇదే ఫొటోను డీకే శివకుమార్ షేర్ చేస్తూ ‘‘కర్ణాటక సురక్షిత భవిష్యత్తు, మన ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత. అది నెరవేర్చేందుకు మేము ఐక్యంగా ఉంటాము’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. ఇకపోతే, డీకే శివకుమార్ వచ్చే పార్లమెంటరీ ఎన్నికలు ముగిసే వరకు కర్ణాటక పీసీసీగానూ కొనసాగుతారని వేణుగోపాల్ చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న ఉంటుందని ప్రకటించారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు.
కాగా, కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది. సిద్ధరామయ్య పేరునే పరిశీలకులు కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకుల బృందం తీసుకుంది. మెజార్టీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. డీకే శివ కుమార్ తో కాంగ్రెస్ అధిష్ఠానం సంప్రదింపులు జరిపి ఆయనను ఒప్పించింది. డీకే శివకుమార్‌కి డిప్యూటీ సీఎం సహా కీలక శాఖలు, కాంగ్రెస్‌లోనూ కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని కూడా మొదటి నుంచి ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఇది కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







